Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం
Konaseema District Name Change: కోనసీమ జిల్లా పేరు మార్చవద్ధంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు స్పందించి యువకుడ్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.
Protest At Konaseema Collector Office: కోనసీమ జిల్లాకు పేరు మార్పుపై నిరసనలు మొదలయ్యాయి. తమ జిల్లా పేరు మార్చవద్దని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంను ముట్టడించిన కొందరు నిరసన కారులు, గేట్ ను తోసుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆఫీసులోకి దూసుకెళ్తున్న ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురంలో నల్ల వంతెన నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. కోనసీమ ముద్దు.. ఏ పేరు వద్దు అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని ఆఫీసులోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. కోనసీమ జిల్లాలో ఉద్యమం ఉధృతమవుతోంది.
యువకుడు ఆత్మహత్యాయత్నం
కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఆందోళనకారులు జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగారు.
కోనసీమ జిల్లా పేరు మార్చవద్ధంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి యువకుడ్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు.
కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆందోళనకారులు
కోనసీమ జిల్లా పేరును మార్చవద్దని, కోనసీమ ముద్దు ఇంకే పేరు వద్దు అంటూ అమలాపురం కలెక్టరేట్ వద్ద నినాదాలు మార్మోగిపోయాయి. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో అమలాపురంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అయితే అంబేడ్కర్ పేరును కచ్చితంగా పెట్టాలని, జిల్లా పేరు అంబేడ్కర్ పేరుతోనే ఉంటుందని, ఈ విషయంలో తగ్గేదేలే అంటూ దళిత సంఘాలు సైతం కలెక్టర్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
జిల్లా పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..
ఏపీ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26కు పెంచగా.. కొన్ని జిల్లాల పేర్లపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లా (Konaseema District)ను అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లా పేరును డా బీఆర్.అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను సైతం కొన్ని సంఘాల నేతలు కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో కొనసీమ జిల్లా పేరును డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Dr BR Ambedkar Konaseema)గా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.