Konaseema: పోలీసులపై హిజ్రాలు ఫైర్, స్టేషన్‌లో ఏకంగా 100 మంది నిరసనల - చివరికి దిగొచ్చిన ఖాకీలు
సుమారు 100 మందికి పైగా హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
యానాంలో తమపై దాడికి పాల్పడడంతో పాటు చంపుతామని బెదిరించిన యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు కోరంగి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. సుమారు 100 మందికి పైగా హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం తాము పట్టించిన నిందితులను వదిలేస్తారా అంటూ పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. స్టేషన్‌లోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డంగా కూర్చోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎస్సై టి.శివకుమార్ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో హిజ్రాలు శాంతించారు. అయితే కేసు నమోదు చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా బాధిత హిజ్రాలు ఐశ్వర్య, లిథియా తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పొట్టకూటి కోసం యానాం ప్రాంతంలో సంచరిస్తున్న తమపై పది మంది యువకులు మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు కర్రలు, కత్తులతో దాడిచేసి గాయపరిచారని ఆరోపించారు.
అంతేకాక, తమ వద్ద సెల్‌ఫోన్లు, పర్స్‌లు కూడా లాక్కుని వెళ్లారని ఆరోపించారు. హిజ్రాలపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి యానాంకు చెందిన కొల్లు మరిడయ్య, ఆకుల సాయిప్రసాద్, మొగలి నానిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
మహిళలను వేధిస్తున్న ఫాదర్
మరోవైపు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చర్చికి వచ్చే మహిళలను ఫాదర్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుని ఆరాధన విషయాలకంటే మహిళల అలంకరణ, నడక గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి ఆదివారం చర్చికి తాళం వేసి సంఘ కాపరిని నిలదీశారు. చర్చి ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడు నెలల నుంచి అతని తీరు మారడంలేదని మహిళలు చెప్పారు. దేవుడి కృప కోసం చర్చికి వస్తున్న తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు.
గొడవలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కుప్పం మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వానగుట్టపల్లెకు చెందిన సుమియా (33), చింపనగల్లు గ్రామానికి చెందిన రిజ్వాన్ ఏడేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నారు. భార్య పేరు సుమియాగా మార్చుకున్నాడు రిజ్వాన్. వీరి కాపురం అప్పుడప్పుడు గొడవలు, కలహాల మధ్యనే సాగింది. ఇద్దరు కుమార్తెలు పుట్టారు. రిజ్వాన్‌కు వేరే మహిళలతో అక్రమ సంబంధం కారణంగా శుక్రవారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయి. తీవ్ర మనస్తాపానికి గురైన సుమియా ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సుమియా తల్లి మునెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని శనివారం బంధువులకు అప్పగించారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు.