AP Elections 2024: పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సమస్య- తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వరుసగా రెండోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు.
Pawan Kalyan to file nomination as Pithapuram MLA candidate- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తడంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేసుకున్నారు. హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. దాంతో ఆ రెండు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ 23న పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 23న) పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ర్యాలీగా బయల్దేరి వెళ్లి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గొల్లప్రోలు పట్టణం వద్ద జాతీయ రహదారిపై ర్యాలీ మొదలవుతుంది.
గొల్లప్రోలు తహశీల్దార్ కార్యాలయం కూడలి, సూరీడు చెరువు (బస్టాండ్), పిఠాపురం దూళ్ళ సంత, చర్చ్ సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ రోడ్ మీదుగా సాగి పాదగయ క్షేత్రం దగ్గర పవన్ కళ్యాణ్ ర్యాలీ ముగుస్తుంది. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు.
ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. జనసేనకు రెండు ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీకే వెళ్లాలని భావించిన పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని తన నియోజకవర్గంగా ఎంచుకున్నారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని, ఏపీ రాజకీయాల్లో మార్పు తన నియోజకవర్గం నుంచే మొదలవుతుందని ఇటీవల పవన్ పేర్కొన్నారు.