Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక.. లంక గ్రామాల్లో టెన్షన్ టెన్షన్
అఖండ గోదావరికి భారీ స్థాయిలో ఎగువ ప్రాంతాలనుంచి వరద పోటెత్తుతోంది.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలోకి చేరిన వరద నీరు అదేస్థాయిలో దిగువకు పొంగి ప్రవహిస్తోంది..

గోదవరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది.. ఈ ఏడాదిలో గోదావరికి వరద పోటెత్తడం ఇది అయిదో సారి.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు గోదావరి అనేకసార్లు ఉగ్రరూపం దాల్చేలా చేస్తున్నాయి.. దీంతో అఖండ గోదావరికి భారీ స్థాయిలో ఎగువ ప్రాంతాలనుంచి వరద పోటెత్తుతోంది.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలోకి చేరిన వరద నీరు అదేస్థాయిలో దిగువకు పొంగి ప్రవహిస్తోంది.. ఈక్రమంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తోన్నాయి.. ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి.
అఖండ గోదావరికి వరద అదేస్థాయిలో పోటెత్తడంతో ధవళేశ్వరం వద్ద ప్రమాదకరస్థాయికి వరద నీరు చేరుకుంటోంది.. 11.70 అడుగులు నీటిమట్టం స్థాయికి చేరుకోవడంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు.. బ్యారేజ్ నుంచి అన్నిగేట్లు ఎత్తి దిగువకు 9.59 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నాయి. దీంతో దిగువనున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరికి మరోసారి వరదలు పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ధవళేశ్వరం బ్యారేజ్‌ను పరిశీలించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పలు లంక గ్రామాల్లో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు.
పొంగి ప్రవహిస్తోన్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు..
ధవళేశ్వరం బ్యారేజ్ దిగువనున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలు వరద ఉద్ధృతికి పొంగి ప్రవహిస్తున్నాయి.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు లంక గ్రామాల్లో వదర ముంచెత్తుతోంది..వరద తాకిడికి జిల్లాలోని సుమారు28కు పైగా లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉద్ధృతికి అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాను కలిపే కనకాయిలంక కాజ్ వే , ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడియం, అప్పనపల్లి కాజ్‌వేలు వరద ముంపుకు గురయ్యాయి.. గండిపెదపూడి లంక, ఊడిమూడిలంక, బూరుగు లంక, అరిగెలవారిపేట
బెల్లంపూడి, పెదమల్లం లంక, పుచ్చల్లంక, అయోధ్యలంక గ్రామాల ప్రజలు వరుస వరద ఉద్ధృతి వల్ల కేవలం పడవలపైనే ఆధారపడి జీవిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది..
పంటు దాటింపులపై నిషేధం అమలు..
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరిపై పంటు, పడవ దాటింపులను అధికారులు నిలిపివేశారు. కోనసీమ - పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట నదీపాపై సఖినేటిపల్లి, నర్సాపురం కు పంటు దాటింపులను నిలిపివేశారు. గౌతమి నదీపాయపై ముక్తేశ్వరం - కోటిపల్లి రేవులో పంటు దాటింపులను నిలిపివేశారు.. అదేవిధంగా జిల్లాలోని పలు రేవుల్లో పడవ దాటింపులను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.





















