Konaseema News: కోనసీమ వైసీపీలో పదవుల పంపకంపై అసంతృప్తి సెగలు- పార్టీలో అసమ్మతికి కారణమిదేనా?
Konaseema News: కోనసీమ జిల్లాలోని వైఎస్సార్‌సీపీలో ఇటీవల ప్రకటించిన పదవుల పంపకాలపై ఆ పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారా? పదవులన్నీ సమన్వయకర్తల అనుయాయులకే దక్కుతున్నాయా..?

Konaseema News:ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్రకటించిన రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల పదవుల జాబితాలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొంత మందికి పదవులను కేటాయించింది అధిష్టానం.. ఈ పదవుల పంపకంపై అసంతృప్తి జ్వాలలు రేకెత్తుతున్నాయన్న చర్చ జరుగుతోంది.. చాలా నియోజకవర్గాల్లో పార్టీలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నవారిని పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారికి అనుకూలంగా ఉన్నవారికే కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
అమలాపురం నియోజకవర్గ పరిధిలో అయితే పదవులన్నీ కేవలం మాజీమంత్రి, ప్రస్తుత అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పినిపే విశ్వరూప్‌కు అనుకూలమైన వారికే దక్కాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కనపెట్టిన అధిష్టానం కనీసం పార్టీలో సీనియర్ల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా పదవులు కట్టబెడుతోందంటూ మండిపడుతున్నారు. దీనిపై ఎవ్వరూ బహిరంగంగా స్పందించకున్నా లోలోన రగిలిపోతున్నారు. సుధీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ పార్టీ కోసం పాటుపడిన వారు చాలా మంది ఉన్నారని, కానీ వారికి ఇప్పటికీ చేదు అనుభవమే ఎదురవుతోందని వాపోతున్నారట.. ఇలా అయితే పార్టీ ఎలా బలపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
ఒకే కుటుంబంలో రెండు పదవులపై అసంతృప్తి..?
వైఎస్సార్‌సీపీ ఇటీవలే అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో పలు హోదాల్లో 19 మందికి పదవులు ఇచ్చింది.. అయితే వీటిలో ఒకే కుటుంబంలోను, కొంత మంది నాయకులకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెట్టారని ఆపార్టీలోని సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారట.. జిల్లాలో అగ్రభాగం జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గానికి ఆరు పదవులు కేటాయించింది.. అయితే ఇందులో లోపాలను ఆపార్టీ నాయకులే ఎత్తిచూపుతున్న పరిస్థితి ఉత్పన్నమవుతుంది..
ఉదాహరణకు స్టేట్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ, స్టేట్ బూత్ కమిటీ వింగ్ సెక్రటరీ పదవులు ఒకే కుటుంబంలోని వారికే పదవులు కేటాయించారని, పార్టీలో పనిచేసేవారు ఎవరూ లేకనే ఒకే కుటుంబంలో రెండు పదువులు కట్టబెట్టారా అంటూ కొంతమంది వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే నియోజకవర్గంలో ఇచ్చిన పదవుల్లో ఓ మహిళా నాయకురాలిపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. భర్త ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూటమి నాయకులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుంటారని, ఆయన భార్య ఇంతకు ముందు పార్టీ కోసం ఏం కష్టపడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలా పదవులపై ఆ పార్టీలోనే అసంతృప్తి సెగలు వెళ్లగక్కుతున్నారు..
అనుకూలమైతేనే ఆమోదమా..!
అమలాపురం వైఎస్సార్‌సీపీలో కష్టపడి పనిచేసేవారికి మొండిచేయిచూపడం ఇప్పడేమీ కొత్తకాదని పలువురు ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వారికి పార్టీలో నేటికీ గుర్తింపు లభించడంలేదని సుధీర్ఘకాలంగా పార్టీలో పాటుపడుతున్నవారిని ఇంకెప్పడు గుర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. జిల్లా అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉన్నా మాజీ మంత్రి విశ్వరూప్ కు వెన్నంటి ఉంటేనే వారికి గుర్తింపు లభిస్తుందని, లేకపోతే మిగిలిన వారి పని దిగదుడుపేనని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పార్టీలో అధికారంలో ఉన్నప్పడు లేనప్పడు అన్నతేడా లేకుండా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన పదవులన్నీకేవలం విశ్వరూప్ కుటుంబానికి ఆమోదయోగ్యమైన వారికే ఇస్తున్నారని, అయితే పార్టీ కార్యక్రమాల విషయంలో ఏస్థాయిలో వారు పార్టీకి ఉపయోగపడుతున్నారో అన్నది ఇప్పటికైనా అధిష్టానం గుర్తెరగాలని హితవు పలుకుతున్నారట.. ఇప్పటికే పార్టీ తగిన నష్టాన్ని మూటకట్టుకోవాల్సి చవ్చిందని, రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే మరింత నష్టపోయే పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట..





















