Pilli Subash Chandra Bose: జనసేనకు తగ్గిన సీట్లతో కాపుల్లో అసంతృప్తి, అదే వైసీపీకి ప్లస్!: పిల్లి సుభాష్ చంద్రబోస్
Pilli Subash Chandra Bose: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని, ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
Former Minister Pilli Subash Chandra Bose Interview : సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న పార్టీల్లో జనసేనకు నామమాత్రపు సీట్లు మాత్రమే లభించడం పట్ల కాపు యువత అసంతృప్తితో రగిలిపోతున్నారని, ఇది వైసీపీకి మేలు చేస్తుందని మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ‘ఏబీపీ దేశం’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను పంచుకున్నారు. కాపులకు మిగిలిన పార్టీలు కంటే వైసీపీలోనే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చామని, కాకినాడ ప్లామెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లను కాపులకు ఇచ్చామన్నారు. ఇచ్చిన సీట్లలో విజయం కోసం జనసేన శాయశక్తులా పోరుడుతోందన్నారు.
సీఎం జగన్ గడిచిన ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, కొవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఆదాయం లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం సీఎం జగన్ విస్మరించలేదని బోస్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే ప్రజల వద్దకు వెళ్లలేమని, అమలు చేయలేని పరిస్థితి ఉంటే అసెంబ్లీని రద్దు చేసి వెళ్లిపోదామని అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే జగన్ చెప్పారన్నారు. మద్యపాన నిషేదం చేయడం సాధ్యం కాదని, ప్రైవేటులో మద్యం ఉండడం కంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండడం వల్ల నియంత్రణ సాధ్యమవుతుందన్నదే ప్రభుత్వ ఉద్ధేశమన్నారు. దేశంలోన్ని అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగాయని, పరిస్థితులను బట్టి రేట్లు పెరుగుతుంటాయని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు హామీలపై నమ్మకం లేదు
చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎటువంటి హామీలను అయినా ఇస్తారన్న భావన ప్రజల్లో ఉందని, అందుకే తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలను నమ్మడం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొనన్నారు. 2014 ఎన్నికలకు ముందు 600కుపైగా హామీలను ఇచ్చిన చంద్రబాబు.. 40 మాత్రమే అమలు చేశారన్నారు. వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన అనేక హామీలను ఆయన విస్మరించారన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని, కాబట్టే తమ గెలుపు సునాయాశమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలన్న భావన ఇక్కడి ప్రజల్లో కనిపిస్తోందని, కాబట్టి రామచంద్రాపురంలో తన కుమారుడు గెలుపు నల్లేరుపై నడకేనన్నారు.
అండగా ఉండాలని నిర్ణయించుకున్నా..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయంగా తనను ఎంతగానో ప్రోత్సహించి అండగా నిలబడ్డారని బోస్ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయారన్న విషయం తెలిసి కర్నూలు ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోజే తాను మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకుని కారుకు ఉన్న సైరన్ లైట్ తీయించానన్నారు. రాజశేఖర్‌రెడ్డితో చనిపోయే నాటికి జగన్‌తో తనకు ఎద్దగా పరిచయం లేదని, కానీ, రాజేశేఖర్‌రెడ్డికి నమ్మిన వ్యక్తిగా వారి కుటుంబానికి కష్టాల్లో అండగా ఉండాలని నిర్ణయించుకుని మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు బోస్ తెలిపారు. రాజకీయ భవిష్యత్‌కు సహకారాన్ని అందించడంతోపాటు ఆర్థికంగానూ వైఎస్ తనకు సహాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బోస్ గుర్తు చేసుకున్నారు.
ఇద్దరిదీ భిన్నమైన శైలి..
వైఎస్‌ఆర్‌ను జగన్‌తో, జగన్‌ను వైఎస్‌ఆర్‌తో పోల్చలేమని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇద్దరిదీ విభిన్నమైన శైలి అని ఆయన పేర్కొన్నారు. జగన్ ఎవరి మాటా వినరని, అన్ని శాఖలను ఆయన గుప్పిట్లో పెట్టుకుంటారన్న ప్రచారం ఉందన్నారు. అయితే, తాను రెవెన్యూశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఒక్కసారి కూడా తన శాఖకు సంబంధించిన అంశాల్లో జగన్ తలదూర్చలేదన్నారు. బదిలీలు గురించి కూడా మాట్లాడలేదని బోస్ స్పష్టం చేశారు. ఒక పోస్టింగ్ కోసం తనకు కోటి రూపాయలు లంచంగా ఇచ్చేందుకు ప్రయత్నించారని, నిబంధనలకు అనుగుణంగానే బదిలీలు చేయాలని చెప్పి సున్నితంగా ఆఫర్‌ను తిరస్కరించినట్టు బోస్ వెల్లడించారు. ఒక పోస్టింగ్‌కు అంత మొత్తం ఇస్తారని తానెప్పుడు అనుకోలేదని ఎంపీ బోస్ వివరించారు.
శెట్టి బలిజలకు దక్కిన గౌరవం
పార్లమెంట్‌లో ఇప్పటి వరకు శెట్టిబలిజలు ఎవరూ అడుగు పెట్టలేదని, ఆ అవకాశాన్ని జగన్ తనకు కల్పించారన్నారు. పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన తొలి శెట్టి బలిజను తానే కావడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యసభకు తనను పంపించాలని భావించినప్పుడు పిలిచి ఒక మాట చెప్పారని, మండలిని రద్దు చేసే ఆలోచనలో ఉన్నానని, ఎప్పుడైనా జరగొచ్చన్నారు. అందుకే రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నానని ఆయన చెప్పారని, దానికి తానూ సానుకూలంగానే స్పందించిన విషయాన్ని బోస్ వెల్లడించారు. పార్లమెంట్‌లో కూర్చోవాలన్న తన కోరిక, మనవడిని ఢిల్లీలో చదివించాలని ఆసక్తితో అంగీకరించినట్టు వివరించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ హయాంలో శెట్టి బలిజలకు ప్రాధాన్యత లభిస్తోందని, మత్స్యకారులకు కూడా తగిన గుర్తింపు దక్కిందన్నారు. ఎన్‌టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత శెట్టి బలిజలకు కొంత ప్రాధాన్యత దక్కిందని, ఆ తరువాత ఇప్పుడు మరింత ఉన్నత స్థాయికి ఆ గుర్తింపు జగన్ తీసుకెళ్లారన్నారు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా పనికి రారంటూ చంద్రబాబు గతంలో లేఖ రాశారని, ఇది అత్యంత తప్పుడు నిర్ణయమన్నారు. ఇది చంద్రబాబుకు వెనుకబడిన వర్గాలపై ఉన్న అభిప్రాయమని బోస్ స్పష్టం చేశారు.
కాపులతో రాజకీయంగా కొన్ని చోట్ల విబేధాలు శెట్టి బలిజలకు ఉన్నాయే తప్పా.. వైరం లేదని బోస్ స్పష్టం చేశారు. జగన్ సంక్షేమ పథకాలు పట్ల వెనుకబడిన వర్గాలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇళ్లు గడవని స్థితి నుంచి బయటకు రాగలిగామని, అత్యధికంగా ఎనిమిది లక్షలు ఒక కుటుంబానికి దక్కిందంటే ఏ స్థాయిలో లబ్ధి చేకూరిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలో మెజార్టీ ప్రజలకు మేలు చేకూర్చామని, ఎక్కడా లేని పథకాలను అమలు చేశామన్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. మిత్రుత్వం ఉండదు..
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఏదీ ఉండదని తోట త్రిమూర్తులను ఉద్దేశించి పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య ఆస్తి, వ్యాపార తగాదాలు లేవని, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని అంగీకరించాలని స్పష్టం చేశారు. ప్రజలు మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రామచంద్రాపురంలోని తన అనుచరులు, కేడర్‌పై మా పార్టీలోని నాయకుడే కేసులు పెట్టించారని, వారంతా తన దగ్గరకు వచ్చి ఇక్కడ పోటీ చేయాలని, లేకపోతే సంబంధాలు కట్ చేసుకుంటామని చెప్పారన్నారు. అందుకే ఆయన్ను బలంగా వ్యతిరేకించి టికెట్ కోరినట్టు తెలిపారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా కేడర్‌ను కాపాడుకునేందుకు మళ్లీ పోటీకి సిద్ధపడ్డానని, వారసుడిని బరిలోకి దించినట్టు తెలిపారు.
తోట త్రిమూర్తులపై పెట్టిన శిరోముండనం కేసుకు 23 ఏళ్లు అని, తమ పార్టీ వయసు 12 ఏళ్లు మాత్రమేనన్నారు. పార్టీకి, ఆ కేసుకు సంబంధం లేదన్నారు. తమ పార్టీకి దళితులు, బీసీలే వెన్నుముక అని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు క మ్యూనిటీలో పాపులర్ వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎవరికైనా కులం బేస్ అని, కులాన్ని బేస్ చేసుకుని స్ట్రెక్చర్‌ను మర్చిపోకూడదన్నారు. అంటే, కులాన్ని చూసుకుని ఇతరులను మర్చిపోతే ఇబ్బందులు తప్పవని, రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అప్పుడే ఎక్కువ కాలం రాజకీయాల్లో మనగలమనానరు. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ కంటే ముందు కాపు కులం నడిచిందని, దానివల్ల ఆయన రాజకీయాల్లో సస్టైన్ కాలేకపోయారని పేర్కొన్నారు.
రాజకీయాల్లో తండ్రీ, కొడుకు, అన్నదమ్ములు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయని, షర్మిల్, జగన్ విషయంలో దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా రెండేళ్ల కాలం పూర్తయిందని, బీజేపీకి సపోర్ట్‌గా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోనని, రామచంద్రాపురంలో తన కుమారుడి విజయం తథ్యమన్నారు.