By: Vijaya Sarathi | Updated at : 11 Dec 2022 12:02 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
11 డిసెంబర్ 1881 .. తెలుగు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు. సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం తొలి వితంతు వివాహం జరిపిన రోజు అదే. అయితే దానిని జరిపించడం కోసం ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలూ అన్నీ ఇన్నీ కాదు. అయినప్పటికీ ఒంటి చేత్తో ఆ పెళ్లి జరిపించి మూఢాచారాలూ, ఛాందసవాదానికి తెలుగునాట చెల్లుచీటి పలకడానికి ముందడుగు వేశారు కందుకూరి.
భారత దేశాన్ని పట్టిపీడించిన సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు వివక్ష
ఎంతో గొప్ప చరిత్ర కల మన దేశంలో ఎలా మొదలయ్యాయో గానీ కొన్ని దురాచారాలు సైతం భాగం అయ్యాయి. వాటిలో సతీ సహగమనం, బాల్య వివాహాలతో పాటు వితంతు వివక్ష లాంటివి చాలా క్రూరమైనవి. చనిపోయిన భర్తతో బాటు అతని భార్యను కూడా తగులబెట్టే "సతి" దురాచారాన్ని బెంగాల్ కు చెందిన రాజా రామ్ మోహన్ రాయ్, విలియం కెరీల కృషితో లార్డ్ బెంటిక్ తొలిసారిగా 4 డిసెంబర్ 1829 న నిషేధించారు. ఆ తరువాత రాజా రామ్మోహన్ రాయ్ ఆశయాలతో ప్రభావితుడైన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెంగాల్ నుండే వితంతు పునర్వివాహాల కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయన కృషి ఫలితంగా ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్ హౌసీ హిందూ విడోస్ రీ మ్యారేజ్ యాక్ట్ -1856 ను చట్టంగా తీసుకొచ్చారు. అదే ఏడాది అంటే 7 డిసెంబర్ 1856 లో మొట్టమొదటిసారిగా కలిమతి అనే బాల్య వితంతువుకు శ్రీష్ చంద్ర విద్యారత్న అనే తనకు సన్నిహితుడికిమధ్య వితంతు పునర్వివాహం జరిపించారు విద్యాసాగర్. ఇదే భారత దేశం లో నమోదైన మొట్టమొదటి వితంతు వివాహం గా చరిత్రకెక్కింది.
తెలుగునాట తొలి వితంతు వివాహానికి పూనుకున్న కందుకూరి వీరేశలింగం
బెంగాల్ లో వితంతు వివాహం జరిగినా దక్షిణాదిలో మాత్రం ఛాందసం ఇంకా కొనసాగుతున్న రోజులవి. చిన్న వయస్సులోనే ముసలివాళ్ళకి భార్యలుగా వెళ్లి వాళ్ళు చనిపోయాక వితంతువులుగా ఆడపిల్లలు నరకం చూస్తున్న రోజులవి.. ఆ సమయంలో ఈ సాంఘిక దాచారానికి అడ్డుకట్ట వెయ్యాలని కందుకూరి భావించారు. ఆ దిశగా కృషి చేసి రాజమండ్రి లోని తన స్వగృహంలో 1881, డిసెంబరు 11 వ తేదీన బాలవితంతువు గౌరమ్మ, గోగులమూడి శ్రీరాములు అనే వ్యక్తికిపెళ్లి చేశారు. ఈ పెళ్లి గురించి విని వారిపై ఎక్కడ దాడి చేస్తారో అని మండపానికి పెళ్లి కూతురిని,పెళ్లి కొడుకుని రహస్యంగా తీసుకొచ్చారని కందుకూరి తరువాత తన రచనల్లో పేర్కొన్నారు. ఇక ఆ పెళ్లికి ఎవరూ వెళ్లరాదని, వెళితే వారిని ఊరినుండి వెలివేస్తామని ఛాందసులు పిలుపు ఇవ్వడం తో వీరేశలింగం దంపతులే గోదావరి నుండి నీటిని మోశారు. వంట కూడా ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చెయ్యగా కందుకూరి వీరేశలింగం శిష్యులు, విద్యార్థుల్లో కొంతమంది వారికి అండగా నిలబడ్డారు. ఆ చారిత్రక ఘటన జరిగిన కందుకూరి ఇల్లు ఈ రోజు రాజమండ్రిలో ఒక సందర్శనా స్థలంగా మారింది. ఇలా తన జీవితకాలంలో దాదాపు 40 వితంతు వివాహాలు జరిపించారు వీరేశలింగం పంతులు.
నాటి సమాజంలో వితంతువులు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే
ఆ నాటి సమాజంలో కాటికి కాలుజాపి ఉన్న ముసలి మగవాళ్ళు సైతం వయసులో ఉన్న పిల్లలనూ చాలాసార్లు చిన్నపిల్లలను, పసి పిల్లలను కూడా పెళ్లి చేసుకునేవారు. ఆడపిల్ల పెళ్ళికాకుండా పుట్టింట పెద్దమనిషవ్వడం అనేది ఒక పాపంగా భావించే ఆచారం ఈ రకమైన పెళ్లిళ్లకు ఒకసాకుగా పరిణమించేది. అలాగే పేదరికంలో ఉన్న ఆడపిల్లల తల్లితండ్రులు ధనాశతో తమ ఆడపిల్లలకు ఇలాంటి పెళ్లిళ్లు చేసేవారు. అదే కన్యాశుల్కం అనే మరో దురాచారం. పెళ్ళయిన కొద్దికాలంలోనే ఆ పిల్లను కన్నవారింట వదలివేసేవారు. ఆ పిల్ల పెద్దమనిషి అయ్యాక అత్తారింటికి తీసుకెళ్లేవారు. ఇక ఆ అమ్మాయిలు కొద్దికాలానికే తమ ముసలి భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది.
కట్టుబాట్లు, పేదరికము, వివక్షవారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి, ఉప్పు, కారం లాంటివి తినడం నిషిద్ధం. తెల్లవారుఝామున అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర,ఇలాంటి లెక్కలేనన్ని ఆంక్షలు, నియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి కాశీ లాంటి తీర్ధ క్షేత్రాలకు చేరి, తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు. చివరకు ,రాజారామ్ మోహన్ రాయ్ ,ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ .కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా వారి జీవితాలకు ఒక దారి దొరికింది.
వీరేశలింగంని ఎలా అవమానించేవారంటే
వీరేశలింగం విద్యాధికుడు కావడం .. తాను చేపట్టే సంఘసంస్కరణ కార్యక్రమాలకు ఎవరు అడ్డువచ్చినా లెక్క చెయ్యక పోవడం తో పాటు నాటి అధికారుల సపోర్ట్ కూడా ఆయనకే ఉండడం తో ఏమీ చెయ్యలేని సాంప్రదాయ వాదులు ఆయనను అవమానించడం కోసం తమ ఇళ్లల్లో వీరేశం ,వీరయ్య లాంటి పేర్లు గల వారిని పనికి కుదుర్చుకుని వీరేశలింగం పంతులు ఆ దారిని వెళుతుండగా "ఒరేయ్ వీరిగా " లాంటి పిలుపులతో పాటు కొన్ని తిట్లూ కూడా వాడేవారని రాజమండ్రి లో తెలుగు లెక్చరర్ గా పనిచేసి రిటైరయిన విశ్వనాథం తెలిపారు. కానీ ఈరోజున వాళ్ళెవరూ ప్రపంచానికి గుర్తు లేరు. కానీ కందుకూరి వీరేశలింగం మాత్రం ఇన్నేళ్ల తర్వాత కూడా తెలుగుజాతికి ఒక ఆదర్శప్రాయుడిలా చరిత్రలో నిలిచిపోయారు.
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!
ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో నాయీబ్రాహ్మణులకు ఛాన్స్- సంతోషం వ్యక్తం చేస్తున్న వైసీపీ లీడర్లు
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!