Ex MP GV Harsh kumar: మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్, అక్కడి నుంచే పోటీ చేస్తారా?
Harshakumar Politics: అమలాపురం ఎంపీగా రెండు సార్లు పనిచేసిన జీవీ హర్షకుమార్ మళ్లీ రాజకీయంగా మరోసారి తన ఉనికిని చాటుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
EX MP Harshakumar News: అమలాపురం ఎంపీగా రెండు సార్లు చేసిన జీవీ హర్షకుమార్ మళ్లీ రాజకీయంగా మరోసారి తన ఉనికిని చాటుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వడివడిగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అడపా దడపా వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన హర్షకుమార్.. రాబోయే ఎన్నికల్లో తన పట్టును పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంపై ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఆ సభకు అంతంత మాత్రంగా జనాలు రావడంతో ఆయన రాజకీయ భవితవ్యంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి..
అమలాపురంలో ఆత్మీయ సమ్మేళనం..
చాలా కాలం తరువాత అకస్మాత్తుగా మళ్లీ తెరమీదకు వచ్చిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కోడూరుపాడు గ్రామంలో ఆత్మీయ సమేళనం పేరుతో సభ నిర్వహించారు. ఈసభకు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నలుమూలల నుంచి కనీసం 25 వేల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఇక్కడి సభ కోసం దాదాపు 10 వేల మందికి సైతం భోజనాలు ఏర్పాటు చేశారు కూడా.. అయితే ఆ స్థాయిలో జనాలు రాకపోవడం మైనస్ అయింది. అయితే తాము అనుకున్న దానికంటే మించి ప్రజలు సభకు హాజరయ్యారని, ప్రజల్లో హర్షకుమార్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని మరో వర్గం చెబుతోంది.
టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి అంటూ ప్రచారం..
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆత్మీయ సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన సభ కేవలం రాజకీయంగా తాను యాక్టివ్ అవుతున్నానన్న సంకేతాలను పంపినట్లు కనిపిస్తోంది. ఈ సభలో హర్షకుమార్ చెప్పకనే చెప్పారు. ఈ సారి మీరు ఆశీర్వదిస్తే అమలాపురంలోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. అంటే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయనున్నట్లు స్థానికంగా చర్చ మొదలైంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది అసలైన సవాల్. మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దిగుతారని చర్చ జరుగుతోంది. హర్షకుమార్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటే 2019లో టీడీపీ తరుపున బరిలో నిలిచి ఓటమి పాలైన బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ బాలయోగిని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపుతారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. లోక్ సభ ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ నుంచి హర్షకుమార్ పోటీ దిశగా పావులు కదుపుతున్నారు.