Chandrababu Public meeting: చంద్రబాబు అనపర్తి సభకు అనుమతి రద్దు! మండిపడుతున్న టీడీపీ నేతలు!
Chandrababu Public meeting: టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మరోసారి పోలీసులపై విమర్శలు ఎక్కుపెట్టింది టీడీపీ. అనపర్తి సభకు అనుమతి ఇచ్చి రద్దు చేశారంటున్నారు.
Chandrababu Public meeting: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో మరోసారి వివాదం నెలకొంది. సభలకు పోలీసులు అడ్డు తగులుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అనపర్తిలో చంద్రబాబు చేపట్టబోయే సభకు అనుమతి రద్దు చేశారని నేతలు మండిపడుతున్నారు. గురువారం సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరిస్తూ శుక్రవారం నోటీసులు జారీ చేశారంటున్నారు.
దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. గురువారం రోజే ఈ సభకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. సడెన్‌గా సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఈరోజు నోటీసులు జారీ చేశారని వాపోతున్నారు. చంద్రబాబు సభ నిర్వహించే ప్రాంతం అత్యం రద్దీ ప్రాంతమని, ఐదు వేలకు మించి ప్రజలు పట్టే అవకశాం లేదంటూ నోటీసుల్లో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో రాజమహేంద్రవరం, జగ్గంపేట, పెద్దాపురంలో భారీ స్థాయిలో జనం తరలివచ్చి చంద్రబాబు సభకు నీరాజనం పలికారని చెబుతున్నాయి.
అనపర్తిలో జరిగే భారీ బహిరంగ సభ అనుమతి కోసం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి నేరుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. దీంతో చంద్రబాబు సభకు కలెక్టర్, ఎస్పీలు అనుమతులు జారీ చేశారు. అనుమతులు రావడంతో టీడీపీ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు సభ కోసం పోలీసులు నోటీసులు జారీ చేయడంతో పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే టీడీపీ సభలకు ఆటంకాలు కల్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యువనేత లోకేష్ పాదయాత్రకు చాలా ఆటంకాలు కల్గించారని, ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు యాత్రకు కూడా ఆటంకాలు కల్గించేలా కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడితున్నారు.
నిన్నటి సభలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 కోట్ల అప్పులను ఏపీ సీఎం జగన్ కట్టరని, ప్రజలే కట్టుకోవాలని అన్నారు. రూ. లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తిన వేసి.. జగన్ ఓడిపోయాక ఎక్కడికి పారిపోతారో కూడా తెలియదని ఆరోపించారు. అంతే కాకుండా ప్రజలకు రక్తాన్ని తాగే జలగలు... వైసీపీ దొంగలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల ఆస్తి పరుడైన సీఎం.. రాబోయే ఎన్నికల్లో పేదలకు-ధనికులకు యుద్ధం అంటున్నారని.. ఇదెక్కడి విడ్డూరమని చంద్రబాబు అన్నారు. జగన్ అఫిడవిట్ లో రూ.373 కోట్ల ఆస్తిని పేర్కొన్నారని.. దేశంలో అందరూ సీఎంల సంపద కలిపినా ఈయన సంపదలో సగం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ల పేదవాళ్ల పక్షం అంటే నమ్మడం కష్టమని చెప్పారు. వైసీపీ నేతలు 5, 10 వేల రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారని వివరించారు. ప్రజలు ఏమాత్రం డబ్బులపై ఆశ చూపించినా ఇక మీ భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారంటూ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురువారం రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు.