Chandrababu Health Condition: చంద్రబాబు బరువు 67 కేజీలు, ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు - డాక్టర్ల కీలక ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని డాక్టర్ శివకుమార్ స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన యాక్టివ్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు. చంద్రబాబు ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని, ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేశామని డాక్టర్ శివకుమార్ తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్లశాఖ కోస్టల్ ఏరియా డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్, డాక్టర్ల టీమ్ కలిసి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ లో పలు విషయాలు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన బీపీ నిలకడగా ఉందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు పర్సనల్ డాక్టర్లను సంప్రదించిన తరువాతే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామని డాక్టర్ శివకుమార్ పేర్కొన్నారు.
చంద్రబాబును పరీక్షించాలని టీమ్ ను ఏర్పాటు చేస్తే వెళ్లి పరీక్షలు చేసినట్లు డాక్టర్ శివకుమార్ తెలిపారు. హ్యుమిడిటీ వల్ల రాషెస్ ఉన్నాయి. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయగా.. షుగర్ కంట్రోల్ లో ఉంది. బీపీ నిలకడగా ఉందని, ఆయన యాక్టివ్ గా ఉన్నారని తమతో మామూలుగానే మాట్లాడారని చెప్పారు. చల్లని ప్రదేశంలో ఉంచాలని వస్తే జైలు అధికారులకు వివరాలు చెబుతామన్నారు. నిజంగా అవసరమైతే చల్లగా ఉండే వాతావరణంలో ఉంచాలని కచ్చితంగా సూచిస్తాం. ఒకటే మేషీన్లతో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. గతంలో హెల్త్ పరిస్థితి, రికార్డ్స్ ఏంటో తమకు తెలియదన్నారు.
చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి నివేదికలో కొన్ని లైన్లు బ్లాక్ చేశామని, అది ఆయన వ్యక్తిగత విషయాలు కనుక వెల్లడించలేదన్నారు. కొన్ని విషయాలకు ప్రైవసీ ఉంటుందని, వాటిని వెల్లడించాలని ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును జైలు అధికారులు పాటిస్తామన్నారు. తాను వాడే మందులు చంద్రబాబు చూపించారని, అన్ని పరిశీలించిన తరువాతే మెడిసిన్ వాడామన్నారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని లోకేష్ చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. డీహైడ్రేషన్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లు చెబుతున్నారని మీడియా అడగగా.. ఈ వాతావరణంలో ఎవరికైనా డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది కనుక చల్లని వాతావరణంలో ఆయనను ఉంచాలని సూచించామని తెలిపారు. చంద్రబాబు వయసు గురించి తాము మాట్లాడలేమని, కనుక మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెమట కారణంగా దురద వస్తుందని, రాషెస్ ఎవరికైనా వస్తాయన్నారు.
చంద్రబాబుకు చికిత్స అందిస్తున్న వైద్యులు వీరే..
డా. మార్కండేయులు అసోసియేట్ ప్రొఫెసర్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్), డా. శివకుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ), డా. సునితా దేవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ డెర్మటాలజీ), డా. మహేంద్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ అనస్తీషియాలజీ), డా. హిమజ అసోసియేట్ ప్రొఫెసర్ ( డిపార్ట్ మెంట్ ఆఫ్ పాథాలజీ) చంద్రబాబుకు చికిత్స అందిస్తున్నారని ప్రెస్ మీట్ లో వెల్లడించారు.