Andhra Pradesh: కాకినాడను చుట్టుముట్టేసిన డయేరియా- ఈ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచన
Kakinada: డయేరియా కేసులు విజృంభణ కాకినాడ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Kakinada News: డయేరియా కేసులు కాకినాడ జిల్లాలో దడ పుట్టిస్తున్నాయి. తొలుత తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో వెలుగుచూసిన డయేరియా కేసులు ఇప్పుడు కాకినాడ జిల్లాలో చాలా చోట్ల విజృంభిస్తూ భయాన్ని సృష్టిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే డయేరియాతో బాధపడుతూ ముగ్గురు వరకు మృతిచెందినట్లు తెలుస్తోంది..
కాకినాడ జిల్లాను మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు బాధించాయి. ఇప్పుడు వర్షాలు ఊరట కలిగిస్తున్నాయి. అయితే వర్షాలకు ఈగలు బాగా వ్యాప్తించి జనాలను రోగాల బారిన పడేస్తున్నాయి. ఇప్పుడు ఈ కారణంతోనే డయేరియా వ్యాప్తి చెందింది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాకినాడలో అదే సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
కాకినాడ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతోన్న డయేరియా కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే తొండంగి మండలంలో కొమ్మనాపల్లి, బెండపూడి ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తిచెంది పదుల సంఖ్యలో రోగులు ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు పక్క మండలాలకు కూడా అతిసారం వ్యాపించినట్టు కనిపిస్తోంది.
కాకినాడకు అత్యంత సమీపంలోనే ఉన్న సామర్లకోటలోనూ వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వాంతులు విరేచనాలతో బాధపడటమే కాకుండా డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ లక్షణాలతో కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు వరకు మృతి చెందినట్లు సమాచారముంది.
రోజురోజుకు విజృంభిస్తోన్న డయేరియా...
కాకినాడ జిల్లాలో డయేరియా విజృంభించడం వెనుక తాగునీటి కాలుష్యం ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తొండంగి మండలంలో పలు గ్రామాల్లో డయేరియాతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సామర్లకోట మండలం వేట్లపాలెం జన్నలదొడ్డి గ్రామాల్లోనూ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తాగునీటి కాలుష్యంతోపాటు ఆహారం ద్వారా కూడా అతిసార వ్యాధి విజృంభణకు కారణం అనే అనుమానం కూడా అధికారుల్లో ఉంది. అందుకే మాసం విక్రయాలు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లులో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతోన్న కేసులు..
ఇప్పటికే కాకినాడ జిల్లాలో అధికారికంగా నమోదైన డయేరియా కేసులు 60కు పెరిగాయి. అయితే చాలా కేసులు ప్రైవేటు వైద్యులు దగ్గర, గ్రామాల్లో ఆర్‌ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నారు. దీని కారణంగానే చాలా కేసులు బయటపడని పరిస్థితి కనిపిస్తోంది.
కేసులు పెరుగుతున్న వేళ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో(జీజీహెచ్)లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు అధికారులు. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సూపరెంటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా అదుపులోనే ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడిరచారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి పరిశీలించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
కాచి చల్లార్చిన నీటినే తాగండి...
జిల్లాలో డయేరియా విజృంభిస్తోన్న వేళ ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు. వారం రోజుల పాటు మాంసం, చేపలు వంటి ఆహారాన్ని మానేయాలని, ఈగలు వ్యాప్తి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తాగునీటి కాలుష్యానికి కారణంగా నిలిచే పైప్‌లైన్లు లీకేజీలుపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొన్ని రోజులపాటు మాంసం, చేపల విక్రయాలు లేకుండా చూడాలని, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.