Chiru Pawan Meets: ఒకే రాజకీయ వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ - ప్రజారాజ్యం తర్వాత 13 ఏళ్లకు తొలిసారి అరుదైన సందర్భం
Chiranjeevi and Pawan Kalyan to share stage: ఆజాదీ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం జరగనుంది.
PM Modi to unveil Alluri bronze statue at Bhimavaram on July 4: అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం జరగనుంది. మెగా ఫ్యామిలీ అభిమానులకు, జనసేన మద్దతుదారులకు ఫుల్ మీల్స్ లాంటి సమాచారం ఇది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఒకే రాజకీయ వేదిక పై 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా కనిపించబోతున్నారు. అదీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సొంత జిల్లాలో వీరు ఓకే వేదికపై కనిపించనుండడంతో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదేమైనా కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
భీమవరం తరలిరానున్న ప్రముఖులు:
మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్ని భీమవరంలో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయపార్టీల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారిని ఆహ్వానించింది. ముఖ్యంగా ప్రధాని మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి ఏపీలో రాజకీయ పార్టీలతో పాటు సినీ రంగానికి చెందిన చిరంజీవి వంటి వారికి ఆహ్వానాలు అందాయి. అయితే ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కోసం ఒకే వేదికపై కనిపించిన చిరు, పవన్.. దాదాపు 13 ఏళ్ల తరువాత ఇలా ఒకే రాజకీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కేంద్ర మాజీ పర్యాటక శాఖామంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిరంజీవిని ప్రస్తుత టూరిజం మినిష్టర్ కిషన్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు బీజేపీతో పొత్తు ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ సభకు హాజరు కానున్నారు దాంతో ఈ కలయిక రాజకీయంగా దేనికి సంకేతం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
చిరును ఆకర్శించే ప్రయత్నంలో బీజేపీ బిజీ..
రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే ఆయన కున్న అభిమానగణం రాజకీయాల్లో తమకు ఉపయోగపడుతుందని నేతలు భావిస్తుంటారు. ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోయినా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏకంగా 18 శాతం సీట్లను సంపాదించింది.అలాగే తొలి ప్రయత్నం లోనే 18 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా .. ఆయన జనసేనలో చేరితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్, జనసేన పార్టీ శ్రేణులు చాలా సార్లు బాహాటంగానే తెలిపాయి.
ప్రస్తుతం వారితో పొత్తులో ఉన్న బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బలపడే ఏ అవకాశాన్ని వదులుకునేలా లేదు. అందుకే చిరును తమ వైపో.. లేక తమ సన్నిహిత పార్టీ జనసేన వైపో వచ్చేలా చేస్తే అది తమకు తిరుగులేని బలంగా మారుతుందని బీజేపీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరంజీవిని అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు ప్రత్యేకంగా ఆహ్వానించారని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి జయంతి వేడుకలు కావడం.. పైగా సొంత జిల్లాలోని భీమవరంలో ఈ కార్యక్రమం జరుగుతుండడంతో చిరంజీవి తప్పక వస్తారని బీజేపీ భావించి, ఆహ్వాన పత్రిక పంపారని వారు అంటున్నారు .
దానికి అనుగుణంగానే చిరంజీవి కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతారని, ఆ వేదిక నుండి వచ్చే ప్రసంగాలు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మెగా అభిమానులు జనసేన వైపే..
జనసేన పార్టీ ఏర్పడిన కొత్తలో మెగా అభిమానుల్లో ఒక వర్గం మాత్రమే పవన్ కల్యాణ్ వైపు వచ్చింది. మిగిలిన వాళ్ళు చిరంజీవి తోనే ఉంటామంటూ.. రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి నాగబాబు జనసేనలో యాక్టివ్ కావడంతో నెమ్మదిగా మెగా అభిమానులు అంతా జనసేన వైపే వచ్చారు. ఇటీవలే తామంతా జనసేనతోనే ఉంటామంటూ స్ఫష్టత ఇచ్చేశారు కూడా. దానితో ఇప్పుడు చిరు కూడా జనసేన బాట పడతారా లేక కనీసం మద్దతు అన్నా బాహాటంగా ప్రకటిస్తారా అన్న ఆశ వాళ్లలో ఉంది. ఇప్పడు ఏకంగా ఒకే రాజకీయ సభా వేదికను తమ్ముడితో కలిసి చిరంజీవి పంచుకోనుండడం తో వాళ్ల ఆశలు రెట్టింపు అయ్యాయి.
కాపుల ఓట్ల కీలకం..
ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల పాత్ర బీజేపీకి తెలియంది కాదు. రాష్ట్రంలో ఆర్ధికంగానూ, పలుకుబడి పరంగా బలంగా ఉన్న రెండు ప్రధాన సామాజిక వర్గాలూ అధికార, ప్రధాన ప్రతిపక్షాలను ఓన్ చేసుకున్నట్టే, జనసేన - బీజేపీ వెనుక కాపు సామాజిక వర్గం నిలబడేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కాపులు తమ వెన్నెముక అన్నట్టు, ఆధారం అన్నట్లుగా చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం ఇదే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చిరంజీవిని తమ వైపో.. జనసేన వైపో వచ్చేలా.. లేదా కనీసం మద్దతు ఇచ్చేలా చెయ్యాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకు భీమవరం సభను ఒక వేదికగా చేసుకుంటున్నారన్న వాదన రాజకీయాల్లో మొదలైంది. మరో 24 గంటలు గడిస్తే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్