Chandrababu at Rajahmundry Jail: జైల్లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు, కానీ వారికి మాత్రం నిరాశే!
Family Members meet Chandrababu at Rajahmundry Jail: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి కలిశారు.
Family Members meet Chandrababu at Rajahmundry Jail:
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని కుటుంబసభ్యులు కలిశారు. చంద్రబాబును సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి కలిసి పరామర్శించారు. వారికి 45 నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు సమయం కేటాయించారు. కేవలం ముగ్గురికి మాత్రమే చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. దాంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కు నిరాశే ఎదురైంది. వారు సైతం చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లారు. అయితే చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు తొలిరోజు కేవలం ముగ్గురు కుటుంబసభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారు.
ములాఖత్ లో ముగ్గురికి మాత్రమే ఛాన్స్..
చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళానికి కాస్త విరామం ఇవ్వడం తెలిసిందే. యువగళం కారవాన్ ను రాజమండ్రిలోనే ఉంచారు. చంద్రబాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి వచ్చారు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు వెళ్లారు. అయితే జైలుకు వెళ్లిన వారిలో ముగ్గురికి మాత్రమే చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు. దాంతో భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు జైలులోకి వెళ్లి చంద్రబాబును కలసి పరామర్శించారు. ఏం భయపడవద్దని, న్యాయం తమవైపే ఉందని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెబుతున్నారు.
జైలు వద్ద భారీ భద్రత..
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు వస్తున్నారని జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు జైలు వద్దకు వచ్చి నినాదాలు చేసే అవకాశం ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ముగ్గురు కుటుంబసభ్యులకు మాత్రమే చంద్రబాబును కలిసేందుకు అనుమతించడంతో మిగతా వారు జైలు బయట వేచి చూస్తున్నారని తెలుస్తోంది.