Cannabis Burnt AP: గంజాయిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం, 65000 కిలోలు కాల్చివేసిన ఖాకీలు - రేపు 2 లక్షల కిలోలు మటాష్ !
Andhra Pradesh police burn cannabis: ఏపీ పోలీసులు ఏలూరు రేంజ్ పరిధిలోని ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం 64,832 కిలోల గంజాయిని పోలీసులు కాల్చివేశారు.
ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది. ఈ సంవత్సరం గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం & తూర్పు గోదావరి జిల్లాని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయి. విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాను నిర్మూలించే లక్ష్యంగా పోలీస్ శాఖ మొదటి విడతలో ప్రత్యేక కార్యక్రమాన్ని అక్టోబర్ 30న ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని 7500 ఎకరాల్లో గంజాయి సాగు పంటను ధ్వంసం చేశారు. 2022లో ఏపీ పోలీసులు చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా గంజాయి సాగుకు అత్యంత అనువైన మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెద్దబయలు, ముచంగ్గిపుట్ట, దంబ్రిగూడ, పాడేరు మండలాలలో గంజాయి సాగుని నిర్మూలించింది పోలీస్ శాఖ. నేడు దాదాపు 65 వేల కిలోల గంజాయిని కాల్చివేయగా, శనివారం నాడు 2 లక్షల కిలోలకు పైగా గంజాయిని కాల్చివేయనున్నారు.
అవగాహన కార్యక్రమాలు, గంజాయి పండిస్తున్న ప్రాంతాలపై సర్వే
ఈ సంవత్సరం చేపట్టిన మొదటి, రెండో విడత కార్యక్రమాల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు గంజాయి సాగు, రవాణాతో జరిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు మరియు రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, పాత నేరస్తులను గుర్తించి వారిపైన PD ACT ప్రయోగించారు. ఏజెన్సీ ప్రాంతంలో అల్లం, పసుపు లాంటి పంటలను వేసుకునేందుకు అవకాశం కల్పించారు.
గంజాయి సాగును గుర్తించేందుకు టెక్నాలజీ
నవంబర్-2022 మొదటి విడత 480 ఎకర్యలు, డిసంబర్-2022 రెండో విడతలో 120 ఎకరాల గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం, టెక్నాలజీ ఉపయోగించి గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల శాటిలైట్ ఫొటోలు తీసి పోలీసులతో పాటు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, ఎస్ఐబి సిబ్బందితో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఐదు రోజులపాటు క్యాంప్ ను ఏర్పాటు చేసుకుని మొత్తం 600 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ పలు కేసుల్లో మొత్తం 2.45 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఇందులో 70 శాతం ఒడిశా నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా సిల్వర్ ట్రీ, పెప్పర్, కాఫీ, పసుపు, మామిడి, కొబ్బరి మొక్కలు, జీడి మామిడి, రాగి, రాజ్మ, కంది పంట, అల్లం, వరి, రబ్బర్ మొక్కలు, నిమ్మ, జాఫ్రా, పత్తి, నువ్వులు, పచ్చిమిర్చి, రాగులు, పల్లి, కూరగాల విత్తనాలను అందించారు.
నేటి (23-12-2022) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం 64,832 కిలోల గంజాయిని పోలీసులు కాల్చివేశారు.
డిసెంబర్ 24న (శనివారం) విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, అనకాపల్లి జిల్లాలలో స్వాధీనం చేసుకున్న 1.8 లక్షల కిలోలపైగ గంజాయిని అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామ శివారులో కాల్చివేయనున్నారు. శనివారం నాడే గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 10,000 కిలోలకు పైగా గంజాయిని కాల్చివేయనున్నారు.
డిసెంబర్ 25న విశాఖపట్నం సిటీ, విజయవాడ సిటీలో 25,000 కిలోల గంజాయిని కాల్చనున్నారు. డిసెంబర్ 26న కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో 16,000 కిలోల గంజాయిని కాల్చివేయాలని అధికారులు, పోలీసులు ప్లాన్ చేశారు.
గంజాయి రవాణా కట్టడికి కార్యాచరణ ప్రణాళిక-2023
గంజాయి సాగు,రవాణా, నియంత్రణ, లభ్యతపై విధానపరమైన కార్యక్రమాలుతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సరఫరా చేస్తున్న నెట్ వర్క్ పైన స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. సారిసాుము. గంజాయిపైన అవగాహన, చైతన్యం కోసం హోర్డింగ్ లపైన అన్ని కాలేజీలు, స్కూల్స్ వద్ద SEB టోల్ ఫ్రీ నెంబర్లతో ప్రచారం చేయనున్నారు.