Sister Statue: చనిపోయిన సోదరికి కన్నీళ్లతో రాఖీ కట్టిన తమ్ముళ్లు, సోదర ప్రేమకు నిదర్శనం ఇది
Sister Statue: ఆరో ప్రాణమైన చెల్లి చనిపోయింది. అది తట్టుకోలేని ఆ సోదరులు తమ సోదరి విగ్రహాన్ని తయారు చేయించారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ల మధ్య ప్రేమను తెలిపే రాఖీ పౌర్ణమని రోజు ఆవిష్కరించారు.
Sister Statue: ప్రాణంలా చూసుకునే తోబుట్టువు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను వారికి దూరం చేసింది. చెల్లెలి అనుబంధం తీయని జ్ఞాపకాలుగా నిత్యం వారిని వెంటాడుతున్నాయి. అందుకే ఆ సోదరులు తమ సోదరి భౌతికంగా వారి మధ్య లేకున్నా ఆమె రూపాన్ని మాత్రం తమ కళ్ల ముందు ఉంచుకోవాలి అనుకున్నారు. అందుకే సోదరి ప్రతిరూపాన్ని విగ్రహ రూపంలో తయారు చేయించి ఆవిష్కరించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క విగ్రహానికి రాఖీ కట్టి తమ మమకారాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
ఏడు నెలల కిందట విషాదం..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన మణి (29) ఏడు నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఈమెకు ఓ చెల్లి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తమ తోడబుట్టిన అక్క మరణాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అది తట్టుకోలేకే తమ సోదరి రూపాన్ని తమ కళ్ల ముందు ఉంచుకోవాలని అకున్నారు. అందుకే తమ సోదరి రూపంలో విగ్రహం తయారు చేయించుకోవాలి అనుకున్నారు. అక్క వరలక్ష్మి, సోదరులు శివ, రాజాలు కలిసి మణి విగ్రహాన్ని తయారు చేయించారు. రాఖీ పండుగ సందర్భంగా గ్రామంలో మణి విగ్రహాన్నిఊరేగించి, ఇంటి వద్ద ప్రతిష్టించుకున్నారు. ఏటా రాఖీ పండుగను అందరం కలిసి చేసుకునే వాళ్లం అని... ఈ సారి తమ సోదరి తమతో లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నాం అని.. విగ్రహం పక్కన ఉంటే తమ సోదరే ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపారు.
"చిన్నప్పటి నుంచి మేము అంతా కలిసే ఉంటుండే. అంతా కలిసే చదువుకునేందుకు వెళ్లేటోళ్లం. ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్లం. ప్రతీ రాఖీ పండుగకు అందరం ముందురోజు అమ్మ వాళ్లింటికి వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఈసారి మా అక్క మాతో లేదు. చాలా బాధగా ఉంది. అందుకే విగ్రహం తయారు చేయించినం. విగ్రహాన్ని చూస్తే మా అక్కను చూసినట్టే ఉంది. ఆమె మాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది." - వరలక్ష్మి, మణి సోదరి
ఫ్లెక్సీ ద్వారా సందేశం...!
బైకులపై వెళ్లే సోదరీమణులారా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. మీ చున్నీలు, చీర కొంగులు గాలికి వేలాడుతుంటే సరిచూసుకోండి. ఏ క్షణమైనా అవి బైక్ చక్రంలోకి చుట్టుకుని మిమ్మల్ని కింద పడేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ కుటుంబానికి శోకాన్ని మిగల్చకండి... అంటూ సోదరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అనేక మందిని ఆలోచింపజేస్తోంది.
"మా అక్క, బావ బండి మీద వెళ్తున్నప్పుడు ఆమె చీర కొంగు బండిలో టైరులో ఇరుక్కొని రోడ్డు ప్రమాదం జరిగింది. అలా జరిగి యాక్సిడెంట్ లో మా అక్క చనిపోయింది. ఆమె చనిపోయి ఏడు నెలల అవుతుంది. ఆమె చనిపోయినప్పటి నుంచి మేము అస్సలు మర్చిపోలేకపోతున్నాం. ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటది. ప్రతీ రాఖీ పండుగకు మా అక్కనే ముందు మాకు రాఖీ కట్టేది. కానీ ఈ సారి ఆమె మాతో ఉండదంటే తట్టుకోలేకపోయాం. అందుకే ఆమె విగ్రహాన్ని తయారు చేయించుకున్నాం. ఎప్పుడూ మాకు రాఖీ కట్టే మా అక్కకు ఈసారి మేమే రాఖీ కట్టినం" - శివ, మణి సోదరుడు