Controversy In MP Village: అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం- ఎంపీ స్వగ్రామంలో ఉద్రిక్తత
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ స్వగ్రామం మొగళ్లమూరులో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరకు ఎంపీ అనురాధ చొరవతో వివాదం సామరస్యంగా సద్దుమనిగింది..
Amalapuram News: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ గ్రామం మొగళ్లమూరులో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామ సెంటర్‌లో విగ్రహ ఏర్పాటు గురించి గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాయిదా పడుతూ వస్తోంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని వ్యతిరేకించిన వర్గం డయల్ 100కు ఫోన్ చేసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ విగ్రహాన్ని తీసి పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఈ పరిణామాలుతో ఆదివారం ఉదయం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక దళిత వర్గాలు, పలు దళిత సంఘాలు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని యథాతథంగా ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు..
తొమ్మిది నెలలుగా వివాదం..
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామ సెంటర్‌లో ఖాళీ స్థలంలో అసెంబ్లీ విగ్రహం ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. గత 20 ఏళ్లుగా అంబేడ్కర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 9 నెలల క్రితం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టడానికి వీళ్లేదంటూ గ్రామంలోని మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఎంపీ చింతా అనురాధ సమక్షంలో చర్చలు జరిపారు. అది ప్రభుత్వ స్థలంగా తేలడంతో పంచాయతీ తీర్మానం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎంపీ సూచించారు. అయితే అది కాలయాపన జరుగుతూ వస్తుండగా శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మరోసారి వివాదానికి తెరతీసింది..
అభ్యంతరం లేకపోయినా తీసేశారని ఆరోపణ..
గ్రామ సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు తొలగించారని, విగ్రహాన్ని యథతథంగా ఏర్పాటుచేసుకోనివ్వాలని దళిత వర్గాలు డిమాండ్ చేశాయి.. అయితే పోలీసులు మోహరించి అడ్డుపడడంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న దళిత వర్గాలు, మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అన్ని వర్గాలు కూర్చుని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్, సీఐ వీరబాబులు సూచించారు. అభ్యంతరం తెలిపినవారు ఎవరైనా ఉంటే రప్పించాలని, వాళ్లెవరూ లేనప్పుడు విగ్రహాన్ని పెట్టుకుంటే ఇబ్బందేంటని ప్రశ్నించి ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు..
ఎంపీ చొరవతో సద్దుమనిగిన వివాదం..
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడి, గ్రామంలో పెద్దలను పిలిపించి పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో చర్చలు జరిపారు. చివరకు తొలగించిన విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయించారు. ఎంపీ అనురాధ సమక్షంలో తిరిగి ఏర్పాటు చేసి ముసుగు వేయించారు. చర్చలు జరిపాక అందరి ఆమోదంతో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఎంపీ వెల్లడించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులనుంచి సాధారణ స్థితిలోకి పరిస్థితులు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.