Andhra Pradesh Crime News: ఏలూరులో దారుణం, ప్రేమించలేదని యువతిని హతమార్చిన యువకుడు, ఆపై ఆత్మహత్య
Telugu Crime News: తనను ప్రేమించలేదని పగపట్టిన ఓ యువకుడు నడిరోడ్డుపై యువతిని అతి దారుణంగా కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత అదే కత్తితో కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Eluru News: ప్రేమోన్మాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తనను ప్రేమించలేదని పగపట్టిన ఓ యువకుడు పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువతిని అతి దారుణంగా కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు సైతం మృతిచెందాడు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఏలూరు నగర శివారు సత్రంపాడులో గురువారం ఈ దారుణం జరిగింది.
ప్రేమ పేరుతో వేధింపులు
పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీకిలో జక్కుల రామారావు నివసిస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రాజ్యలక్ష్మి, రామారావుల కుమార్తె రత్నాగ్రేస్ (23) సత్రంపాడులోని ఓ కాలేజీలో 2023లో బీఎస్సీ పూర్తిచేసింది. డిగ్రీ చదువుతున్న సయమంలో ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం రత్నాగ్రేస్‌కు పరిచయమయ్యాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే కొంతకాలంగా ఏసురత్నం తనను ప్రేమించాలంటూ రత్నాగ్రేస్‌ను వేధిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఏసురత్నం తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి అతన్ని మందలించారు.
రత్నాగ్రేస్‌కు నిశ్చితార్ధం
ఈ క్రమంలో రత్నాగ్రేస్‌కు మే 26న వివాహ నిశ్చితార్థమైంది. జూన్ 16న వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి విషయం తెలుసుకున్న ఏసురత్నం ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని, లేకుంటే ఇంకెవరికీ దక్కకూడదని భావించాడు. అందులో భాగంగానే ఆమెను ఫాలో అవడం ప్రారంభించాడు. రత్నాగ్రేస్ గురువారం యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు బయలుదేరింది. అప్పటికే అక్కడ ఉన్న ఏసురత్నం మాట్లాడే పని ఉందని ఆమెతో చెప్పాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లారు. తననే వివాహం చేసుకోవాలని ఏసురత్నం పదే పదే కోరాడు. లేకపోతే చంపేస్తానని, తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని బెదిరించాడు.
ఆవేశంలో హత్య
అయితే తనకు పెళ్లి నిశ్చయమైందని రత్నాగ్రేస్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఏసురత్నం తాను తెచ్చుకున్న బ్యాగు నుంచి కత్తిని తీసి తనను చంపేయాలంటూ అంటూ ఆమె చేతికిచ్చాడు. అందుకు రత్నాగ్రేస్ వారించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఏసురత్నం ఆమె మెడపై విచక్షణారహితంగా నరికాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో రత్నాగ్రేస్ అక్కడికక్కడే మృతిచెందింది. తరువాత ఏసురత్నం సైతం గొంతు కోసుకున్నాడు. మెడ భాగంలో కత్తి తెగడంతో అక్కడే రక్తపు మడుగులో పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రత్నాగ్రేస్ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఏసురత్నాన్ని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో విజయవాడకు తరలించి చికిత్స అందిందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏసురత్నం మృతి చెందాడు. స్థానికుల సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.