Konaseema Crime News :బ్యాంకు నుంచి బంగారం తెస్తానని చెప్పి ఉడాయించాడు- ఓనర్‌కు షాక్ ఇచ్చిన గుమస్తా
Konaseema Crime News: బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించుకొని వస్తానని చెప్పిన గుమస్తా ఓనర్‌కు ఝలక్ ఇచ్చాడు. విడిపించిన బంగారంతో పరారయ్యాడు..

గోదారోళ్లు ఎవ్వరినైనా నమ్మితే అలానే చూసుకుంటారు అంటుంటారు.. అంతేకాదు సమస్త బాధ్యతలు అప్పగిస్తారు.. అయితే ఆ నమ్మకాన్ని అలుసుగా చేసుకుని నయవంచన చేస్తుంటారు కొందరు. గత అయిదేళ్లుగా తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిని నమ్మి బ్యాంకులో కుదువ పెట్టని బంగారాన్ని విడిపించుకురమ్మని డబ్బు ఇస్తే బంగారాన్ని విడిపించి అదే బంగారంతో ఉడాయించాడు ఓ ప్రబుద్దుడు. బంగారం విడిపించుకుని అటునుంచి ఎటో చెక్కేశాడు. బంగారం విడిపించుకురమ్మని డబ్బు ఇచ్చి పంపిన వ్యక్తి నాలుగు గంటలైనా రావడంలేదని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఆఫ్.. సరే అని ఓ పూట అంతా వేచి చూసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు..
అయిదేళ్లుగా గుమస్తాగా పనిచేస్తూ..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన జిఎస్ రావు స్థానికంగా రెస్టారెంట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతని వద్ద ముమ్మిడివరం మండలం క్రాప వాసి కంతేటి రాజా 5 సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా పనిచేస్తుండడంతో మొత్తం ఆర్ధిక లావాదేవిలు అతనికే అప్పగించాడు యజమాని. ఈ నెల 26వ తేదీన జీఎస్ రావు తనకు సంబంధించిన బంగారాన్ని ముమ్మిడివరం సిఎస్బి బ్యాంకు నుంచి విడిపించుకు రమ్మని రూ. 2,25,000 చేతి నగదు ఇచ్చి పంపాడు. ముమ్మిడివరం బ్యాంకు నుంచి బంగారు నగలు విడిపించి తీసుకుని బయలుదేరిన రాజా అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారు అయ్యాడు.
మొదట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయుంటుందని అనుకున్న సదరు ఓనర్ చాలా సేపు పట్టించుకోలేదు. పూట గడిచినా గుమస్తా రాజా తిరిగి రాకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉండడంతో అనుమానం వచ్చింది. బ్యాంకుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ఓనర్ జీఎస్ రావుకు బంగారం విడిపించుకుని వెళ్లినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీంతో రాజా స్వగ్రామం క్రాపలోని కుటుంబికులకు ఫోన్ చేసి అడిగితే అక్కడకు రాలేదని బదులిచ్చారు. దీంతో అనుమానం వచ్చిన సదరు ఓనర్ జి ఎస్ రావు అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓనర్ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ అంచనా ప్రకారం బంగారం విలువ 9,66,000 గాను 2,25,000 నగదు వెరసి 11,91,000 దొంగతనానికి గురి అయినట్లు పోలీసులు గుర్తించారు. బి ఎన్ ఎస్ సెక్షన్ 303(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.





















