Anantapur: అనంతపురంలో అకాల వర్షం! రోడ్డుకు అడ్డంగా చెట్లు, కరెంటు స్తంభాలు
AP News in Telugu: వర్షం కారణంగా రోడ్డుకు అడ్డంగా పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ అధికారులు కరెంటు సరఫరా కూడా వెంటనే నిలిపేశారు. దీంతో ప్రమాదాలు తప్పాయి.
Anantapur Rains: అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి జోరు వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా గుత్తి, ఉరవకొండ, అనంతపురం, కదిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం పడటంతో రోడ్లు నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలి వర్షంతో పాటు పెద్ద ఎత్తున ఈదురు గాలులు వియడంతో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అనంతపురం పట్టణ కేంద్రంలో అర్ధరాత్రి కురిసిన జోరు వానకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. ప్రధాన నగర వీధులు రహదారుల్లో వరద నీరు పెద్ద ఎత్తున నిలవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పలుచోట్ల రోడ్డుకు అడ్డంగా పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ ను సరఫరా కూడా వెంటనే ఆపేయడంతో ప్రమాదాలు తప్పాయి. నగరానికి తాగునీరు అందించే పీఏబీఆర్ డ్యామ్ లో నీటి నిలువలు అడుగంటిపోతున్న సమయంలో వర్షాలు ప్రారంభం కావడంతో కొంత ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుమారు రెండు గంటల పాటు జోరుగా వర్షం కురిసింది. అర్ధరాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
నగరంలో గాలి వానకు 40 చెట్లు విరిగిపోవడంతో పాటు 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ అధికారులు ఉద్యోగులు చెట్లు స్తంభాలు పడిపోయిన ప్రాంతాల్లో పరిశీలించి మరమ్మతులు చేపట్టారు.