(Source: ECI/ABP News/ABP Majha)
RRR Vs YSRCP : రాజ్యాంగం చదువుకోవాలని మంత్రి గౌతంరెడ్డికి రఘురామ సలహా..!
సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్న మంత్రి మేకపాటి వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాజధాని అంశంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని గౌతం రెడ్డి మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. రాజ్యాంగం తెలియకుండా వ్యాఖ్యలు చేయడం.. సీఎం ఎక్కడ ఉంటే అక్కజ రాజధాని అని మాట్లాజటం ఏమిటని ప్రశ్నించారు. ముందుగా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని మంత్రికి ఎంపీకి సలహా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 164నుచదువు కోవాలన్నారు. ఆ ఆర్టికల్ ముఖ్యమంత్రిగా గవర్నర్ నియామకం గురించి ఉంటుంది. అలాగే మంత్రి రాజ్యాంగంలోని 153, 154 నిబంధనలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రాల కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నరే సుప్రీమ్ అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి విశేషమైన అధికారాలు ఉన్నవారు కాదని.. మంత్రుల కంటే కొంచెం మాత్రమే ఎక్కువని స్పష్టం చేశారు. ఆర్టికల్ 3పై రాష్ట్రానికి సంబంధించిన మార్పులపై కేంద్రానికి అధికారం ఉందన్నారు. రాజధాని నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి క్షణం పని అన్నట్లుగా రఘురామ తెలిపారు. పులివెందుల అయినా.. విజయవాడ అయినా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని మేకపాటి పాటి స్టేట్‌మెంట్ ఇచ్చిన సమయంలోనే శ్రీభాగ్ ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. అసలు శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగిందో.. ఆ చర్చలు దేని కోసం జరిగాయో రఘురామ వివరించారు.
1937 నవంబర్‌లో శ్రీభాగ్ అనే పేరున్న భవనంలో ప్రముఖులు చర్చలు అందుకే ఆ చర్చలకు ... చేసుకున్న ఒప్పందానికి శ్రీభాగ్ పేరు పెట్టారన్నారు. శ్రీభాగ్ సమావేశం జరిగిన పదహారేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని రఘురామకృష్ణరాజు మంత్రి గౌతంరెడ్డికి గుర్తు చేశారు. శ్రీభాగ్ భవనంలో జరిగినచర్చల్లో రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు సర్కారు ప్రాంతంలో ఒకటి, రాయలసీమలో ఒకటి ఉండాలని అనుకున్నారని రఘురామ తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక.. కర్నూలులో రాజధాని, గుంటూరులో కోర్టును ఏర్పాటు చేశారన్నారు. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిందని చరిత్ర పాఠాలు చెప్పారు.
రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును ప్రెస్‌మీట్‌లో రఘురామ మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయాక 2014, 15 అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండడానికి జగన్ అంగీకరించారని రఘురామ గుర్తు చేశారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాట మార్చారన్నారు. అలాగే ఉద్యోగుల ఆకాంక్ష మేరకు.. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేస్తామని జగన్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ చేయలేదన్నారు. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు సీపీఎస్ రద్దు గురించి ఆందోళనలు చేయడంతో రఘురామ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.