Raghurama Vs YSRCP : విదేశాలకు వెళ్తే విజయసాయి తిరిగివస్తారా..? రఘురామ అనుమానం..!
తాను విదేశాలకు పారిపోతున్నానని గతంలో ప్రచారం చేశారని ఇప్పుడు ఎవరు వెళ్తున్నారని రఘురామకృష్ణరాజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. తన మనసులో ఉన్న వాటిని ఇతరులపై రుద్దుతారని ఆరోపించారు.
విశాఖపట్నంలో తీర ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలో విదేశాల్లో పరిశీలించి వస్తాననిచెప్పి విదేశీ పర్యటనకు విజయసాయిరెడ్డి అనుమతి తీసుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో తాను విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని ఇప్పుడు ఎవరు విదేశాలకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మళ్లీ తిరిగి వస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తూ... వారి మనసులో ఉన్న విషయాలను అందరికీ ఆపాదిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు అంశాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. విశాఖలో చాలా తీర ప్రాంతం ఉందని ఆ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అలాంటి తీర ప్రాంతాలే ఉన్న దేశాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించాల్సి ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన సీబీఐ కోర్టు అక్టోబర్‌లోపు రెండు వారాల పాటు విదేశీ పర్యటన చేయడానికి అంగీకరించింది. దుబాయ్, ఇండొనేషియాలోని బాలి, మాల్దీవ్స్ వెళ్లడానికి ఆయనకు పర్మిషన్ వచ్చింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు. ఆయనకు విశాఖలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బాధ్యతలేమీ లేవు. అయినా అదే కారణం చెప్పి విదేశీ పర్యటనకు పర్మిషన్ తీసుకున్నారు. అందుకే రఘురామకృష్ణరాజు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. తాను విదేశాలకు పారిపోయి.. మళ్లీ తిరిగి రానని సోషల్ మీడియాలో వైసీపీ నేతలతో ప్రచారం చేయించిన దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఇప్పుడు విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తూండటంతో ఆయన తిరిగి రారన్నట్లుగా రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు.
బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరిగిన రోజున జగన్మోహన్ రడ్డికి చెందిన మీడియాలో ముందుగానే తీర్పును ప్రకటించారని కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారని ఆయన ప్రశ్నించార.ు అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఏపీని అప్పుల కుప్ప చేశారని.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను దాటి మరీ అప్పులు చేశారని.. మండిపడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఖ్యాతిని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వారిలో ఎన్టీఆర్ ఒకరైతే.. ఎన్వీ రమణ మరొకరు అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. గొప్ప తీర్పులు ఇస్తున్నారని.. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తున్నారని అభినందించారు.