Andhra News : ఏపీలో మాఫియారాజ్ - ఎలుకలు పిల్లిని తరుముతాయి - రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సెటైర్
Andhra Politics : పిన్నెల్లి అరెస్ట్ ఉదంతంపై పీవీ రమేష్ సెటైర్ వేశారు. డబ్బు, కండ బలమే ఏపీలో పోలింగ్ రూల్‌గా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
PV Ramesh On Pinnelli Episode : మాచర్లలో భయానక వాతావరణం సృష్టించి,ఈవీఎంలను కూడా ధ్వంసం చేసి వీడియోకు చిక్కిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వ్యవస్థలు అరెస్టులు చేయలేకపోవడంపై రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. మాచర్ల ఎపిసోడ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎలుకలు పిల్లిని వెంబడించిన కేసుగా పిన్నెల్లి వ్యవహారాన్ని పీవీ రమేష్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, రెవిన్యూ అదికారులు ఎల్ల వేళలా ఎమ్మెల్యేల సర్వీసులో ఉంటారన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, అధికార బల ప్రదర్శన మామూలుగా మారిందన్నారు. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదని.. అది అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. అయితే డబ్బులిస్తున్న వారిని ఎందుకు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఓ మాఫియా రాజ్ గా మారిందని .. అయినప్పటికి ఇది ప్రజాస్వామ్యంగా నటిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.
👇A case of mice🐭chasing the cat 😾?
— Dr PV Ramesh (@RameshPV2010) May 24, 2024
In several states, #AndhraPradesh being the trailblazer, most police & revenue functionaries are in '24/7 service' of 'their' #MLA. 'Baksheesh' for seamless money & muscle management during polling is the norm. The cancer is more vicious and… pic.twitter.com/yJUtimfi6P
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడంలో పోలీసులు పెద్ద ఎత్తున డ్రామా నడిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రాక ముందు ఆయనపై కనీసం కేసులు పెట్టలేకపోయారు. ఆ తర్వాత కేసులు పెట్టినా అరెస్టు చేయలేకపోయారు. చేజింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చారు. ఏడెనిమిది బృందాలు తిరుగుతున్నాయని.. ఈసీ చాలా సీరియస్ గా ఉందని ప్రకటనలు చేశారు. చివరికి ఆయన సావధానంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుని సాయంత్రానికి ఫలితం తెచ్చుకున్నారు. అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో పోలీసులు విఫల వ్యక్తులుగా మిగిలిపోయారు.
మాచర్లలో పోలింగ్ రోజు వైసీపీ నేతలు చేసిన ప్రతి విధ్వంసం వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.అయితే పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయలేదు. ఒక సీఐపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నా.. నిర్లక్ష్యం వహించారు. తీవ్రమైన విమర్శలు రావడంతో.. పోలింగ్ తర్వాత రెండు ఘటనల్లో హత్యాయత్నం కేసులు పెట్టారు.కానీ అరెస్టు చేయలేదు. ఈ విషయాలపై అందరిలానే పీవీ రమేష్ స్పందించారు. వ్యవస్థల వైఫల్యంపై ఆవేదన వ్యక్తం చేశారు.