AP BJP : టీటీడీలోనే మత మార్పిళ్లు - వైసీపీ సర్కార్‌పై పురందేశ్వరి తవ్ర విమర్శలు !
టీటీడీలో మత మార్పిళ్లు జరుగుతున్నాయని పురందేశ్వరి ఆరోపించారు. విశాఖలో బీజేపీ కొత్త పదాధికారులతో సమావేశం అయ్యారు.
AP BJP : తిరుమల తిరుపతి దేవస్థానంలో మత మార్పిడి జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఉద్దేశపూర్వకంగా హిందూత్వంపై దాడి చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కొత్త కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. ఎర్రచందనం దారి మళ్ళిస్తున్నారని, అడవులను నాశనం చేయడం వల్లనే అక్కడున్న జంతువులు జనావాసాలకు వస్తున్నాయని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న ఘటనలన్నీ కుట్ర పూరితమేనన్నారు.
రాష్ట్రంలో ఆందోళన కరంగా ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని.. ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఇంటి దగ్గరలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదని పురందేశ్వరి అన్నారు. గ్రామపంచాయతీల నిధులను దారి తప్పించారని.. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయాలని కేంద్రం ఎప్పుడు ఆలోచన చేయలేదని, ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి.. వారి భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు.
పార్టీకి పదాధికారులు అంకితభావంతో పనిచేయాలని, ఒకరికిద్దరికి బాధ కలిగి ఉండవచ్చునని, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని పురందేశ్వరి అన్నారు. అగ్ర నాయకులు ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఇస్తారని, ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ పోవాలని ఆమె హితవు పలికారు. పదవులు వచ్చిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. బీజేపీపై ప్రతి కార్యకర్తకు ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా పదాధికారులు పనిచేయాలని, క్రమశిక్షణతో పనిచేయాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని పురందేశ్వరి పిలుపిచ్చారు.
పురందేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కార్యవర్గాన్ని నియమించారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్దం కావాలన్న అంశంపై చర్చించేందుకు పదాధికారుల భేటీ నిర్వహించారు. పొత్తుల అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్యలు జరగలేదని చెబుతున్నారు. కేంద్రం ఆదేశాల మేరకే ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం గురించి మాత్రమే చర్చించామని బీజేపీ నేతలు చెబుతున్నారు.