Fire In Minister House : మంత్రి విశ్వరూప్ ఇల్లు బుగ్గి - కుటుంబం అలర్ట్ అవ్వకపోతే ...
అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. సమయానికి ఇంట్లో వారిని తరలించడంతో పెను ముప్పు తప్పినట్లయింది.
Fire In Minister House : కోనసీమ జిల్లా పేరు మార్పుపై చెలరేగిన ఆందోళనలు చివరికి మంత్రి పినిపె విశ్వరూప్ ( Pinipe Viswaroop ) ఇంటికి నిప్పు పెట్టడానికి కారణం అయ్యాయి. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్క సారిగా విరుచుకుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోవడంతో ఆందోళనకారులంతా నేరుగా మంత్రి వైపు వెళ్లారు. ఇంట్లోకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆవరణలో మూడు కార్లు ఉంటే.. వాటిని తగులబెట్టారు. ఆ నిప్పులు మొత్తంగా ఇంటినిచుట్టుముట్టాయి. పూర్తిగా ఇల్లు అగ్నికి ఆహుతి అయింది.
ఆందోళనకారులు మంత్రి ఇంటి ( minister House ) పైకి వస్తున్న విషయం ముందుగా తెలియడంతో... మంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. మంత్రి అమలాపురంలోనే ( Amalapuram ) ఉన్నారు. అయితే దాడుల గురించి తెలిసిన తర్వాత ఆయనను పోలీసులు ( Police ) సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను కూడా వెంటనే తరలించారు. ఆందోళనకారులు వచ్చే ముందే కుటుంబసభ్యులను ( Minister FAmily ) తరలించడంతో వారు ప్రాణాలతో బయటపడినట్లయింది.
అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
తన ఇంటిపై దాడి చేయడాన్ని.. ఇంటికి నిప్పు పెట్టడాన్ని మంత్రి విశ్వరూప్ ఖండించారు. కోనసీమ జిల్లా ( Konaseema ) పేరున మార్పు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకటించలేదని, మార్పు చేయాలని అన్ని పార్టీలు విస్తృతంగా డిమాండ్ చేశాయన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన డిమాండ్ చేసిందని, పేరు మార్పును బీజేపీ ( Bjp ) ఆహ్వానించిందని చెప్పారు. చంద్రబాబు కూడా పేరు మార్పెచాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పేరు ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పేరు మార్పు మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్, ఆర్డీవోలకు చెప్పుకొనే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు.
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటంతో ఆందోళనకారుల్ని అదుపు చేయలేకపోవడంతో సమస్య తీవ్రత అంతకంతకూ పెరిగింది. ఆందోళనల కారుల్లో అల్లరి మూకలు చొరబడినట్లుగా అనుమానిస్తున్నారు.