YSRCP IPAC : వైఎస్ఆర్‌సీపీలో ఐ ప్యాక్ అలజడి - అసంతృప్తిలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు!?
వైఎస్ఆర్‌సీపీలో ప్రశాంత్ కిషోర్ టీం హడావుడి అసంతృప్తికి కారణం అవుతోంది. ఇంచార్జులు, పరిశీలకులు, సర్వేలు, రిపోర్టుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని కీలక నేతలు ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
YSRCP IPAC : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ సన్నద్దతలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం పాత్ర చిన్నదేం కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఆ సంస్త పాత్రే ఎక్కువ. ఎలాంటి స్ట్రాటజీలు అయినా ఆ సంస్థ సర్వేలు చేసి.. అంచనాలు వేసి ఇస్తుంది. వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పాటిస్తుంది. గత ఎన్నికల్లో సక్సెస్ కావడంతో ఆ టీంపై సీఎం జగన్‌కు ఎంతో గురి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నేరుగా జోక్యం చేసుకోకకపోయినప్పటికీ ఆయన అనుంగు శిష్యుడు అయిన రిషిరాజ్.. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీలను డిసైడ్ చేస్తున్నారు. అయితే ఈ సారి వైఎస్ఆర్‌సీపీనే పీకే టీంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన తీరు వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని కొందరు.. సర్వేల పేరుతో లేనిపోని టెన్షన్లు తెచ్చి పెడుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు.
క్యాస్ట్ స్ట్రాటజీలు చేటు చేస్తాయన్న ఆందోళనలో కొంత మంది ఎమ్మెల్యేలు!
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కుల, వ్యక్తి, కుటుంబ టార్గెట్ రాజకీయాలకు కారణం పీకే టీమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రత్యేకంగా ఓ స్ట్రాటజీ ప్రకారం సలహా ఇవ్వబట్టే ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చారని అనుకుంటున్నారు. అయితే ఆ నిర్ణయం తమకు చాలా చేటు చేస్తుందని మూడు, నాలుగు జిల్లాల్లో కొన్ని కీలకమైన నియోజకవర్గాలకు చెందిన నేతలు అసంతృప్తికి గురయ్యారు. వారు పెద్దగా స్పందించడం లేదు. పేరు మార్పు అంశాన్ని సమర్థించాలని హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నంత మాత్రాన ఇతర వర్గాలన్నీ ఓట్లు వేయవని వారి వాదన. ఇదంతా పీకే టీం సలహాల వల్లే జరుగుతోందని వారు అసంతృప్తిలో ఉన్నారు.
పర్యవేక్షకుల నియామక సలహా ఇచ్చారని మరికొంత మంది అసంతృప్తి !
ఇటీవల వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్కుల నియామకాలపైపై చర్చ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు తోడుగా పర్యవేక్షకుల్ని నియమించాలని.. అప్పుడు పోటీ ఉండటం వల్ల పార్టీ బలపడుతుందని.. ప్రత్యామ్నాయ నాయకత్వం రెడీ అవుతుందని పీకే టీం జగన్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇది జగన్‌కు నచ్చడంతో ఆయన కూడా వెంటనే పర్యవేక్షకుల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాల్లో తమకు వ్యతిరేకంగా ఇతర నేతల్ని ప్రోత్సహించడం ఏమిటన్న అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికైతే బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ.. ఓ సారి పర్యవేక్షకుల నియామకం అంటూ జరిగితే రచ్చ అయిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సర్వేల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యేల ఆందోళన !
ఐ ప్యాక్ సర్వేలు ఎప్పుడు ప్రారంభించిందో కానీ.. అరవై , డెభ్బై మంది ఎమ్మెల్యేలకు మార్చాలని రిపోర్ట్ ఇచ్చారంటూ ఓ ప్రచారం ప్రారంభమయింది. అందులో ఫలానా వాళ్లు ఉన్నారంటూ పేర్లు కూడా వచ్చాయి. ఇవి అఫీషియల్ కాదు. కానీ అది నిజమేనని నమ్మేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇది పార్టీకి డ్యామేజ్ చేసిందని చాలా మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఇలాప్రచారం చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలిగేలా చేశారంటున్నారు.
గడప గడపకూ రాంగ్ స్ట్రాటజీనే అంటున్న ఎమ్మెల్యేలు !
గడప గడపకూ మన ప్రభఉత్వం పూర్తిగా ఐ ప్యాక్ స్ట్రాటజీ. ప్రభుత్వం చేసిన మేళ్లను లబ్దిదారులకు గుర్తు చేసి ఓట్లు అడిగితే.. తప్పకుండా వేస్తారన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలకు అసంతృప్తి ఉంటుంది . ఇది బయటపడుతోంది. అది విస్తృత ప్రచారానికి కారణం అవుతోంది. దీని వల్ల కూడా పార్టీకి నష్టమేనంటున్నారు. పథకాల లబ్దిదారులకు ప్రత్యేకంగా ఇళ్లకెళ్లి చెప్పాల్సిన పని లేదని.. వారు గుర్తుంచుకుంటారని అంటున్నారు. ఇప్పుడు కాలనీలకు వెళ్లి జరగని అభివృద్ధి పనులు.. పథకాలు అందని వారి వల్ల వ్యతిరేక ప్రచారం జరుగుతోందని అంటున్నారు.
అయితే ఐ ప్యాక్ టీంపై ... వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు ఎవరెస్ట్ అంత నమ్మకం ఉంది. వారి నమ్మకం ముందు పార్టీ నేతల అసంతృప్తి చిన్నదే. అందుకే ఐ ప్యాక్ హవా వైఎస్ఆర్‌సీపీలో కొనసాగే అవకాశం ఎక్కువ ఉంది.