Pawan Kalyan : ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీతోనే విభేదించాను - పవన్ కల్యాణ్
Pawan Kalyan : జనసేనకు ప్రజలతో మాత్రమే పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ప్రజలకు దత్తపుత్రుడని, సీఎం జగన్ మాత్రం సీబీఐకి దత్తపుత్రుడని అన్నారు.
![Pawan Kalyan : ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీతోనే విభేదించాను - పవన్ కల్యాణ్ Prakasam district Parchuru Janasena chief Pawan kalyan criticizes ysrcp govt on farmers issues Pawan Kalyan : ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీతోనే విభేదించాను - పవన్ కల్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/e4f4fe2bf53263587eb4a624062dce71_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan : సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీకు రూ.లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు జనసేనకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేనాని ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూదన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లు ఎమ్మెల్యేలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు ఒక రూల్ సామాన్యులకు మరొక రూలా అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏంచేయలేరనే ధీమాతో వారంతా ఉంటారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే చట్టం రావాలని పవన్ సూచించారు.
రాజకీయ కక్ష తీర్చుకోడానికే
సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, ఏం చేశారని ఎమ్మెల్యేలను ప్రశ్నించడన్నారు. రైతులకు రూ.2 వేల కోట్లు ఇచ్చామంటున్న సీఎం జగన్ ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా వేధిస్తున్నారని పవన్ విమర్శించారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారనీ, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు మాత్రం వినియోగించడంలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
సీబీఐ దత్తపుత్రుడు
తాను ప్రజలకు దత్తపుత్రుడనని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ మాత్రం కచ్చితంగా సీబీఐకి దత్తపుత్రుడన్నారు. భవిష్యత్ లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోకతప్పదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోవడమే వైసీపీ లక్షణమన్నారు. ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాను మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలని పవన్ కోరారు. జనసేనకు పొత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదన్నారు. 2009లో ఏం చెప్పానో అదే చేస్తానన్న ఆయన... ప్రజలకోసం ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించానన్నారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే తన తపన అన్నారు. దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తానన్నారు. అప్పటి వరకు వైసీపీ నేతలు ఏం మాట్లాడినా భరిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న పవన్... కేంద్రాన్ని నిందించడం కాదు మన బంగారం మంచిదవ్వాలన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)