Section 144 in Andhra Pradesh: స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్, ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ - జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు
Section 144 in Andhra Pradesh: చంద్రాబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
Section 144 in Andhra Pradesh: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాకిచ్చింది. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు.
జిల్లా ఎస్పీలకు కీలక ఆదేశాలు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు గుంపుగా ఉండకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
మరికాసేపట్లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. లేక రాత్రి సిట్ ఆఫీసుకు తరలించి, రేపు ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం సైతం ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది.
అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నేటి ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. ఒకవేళ ఆ సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.