MLA Payyavula Kesav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై పోలీసు కేసు - 341,188 సెక్షన్ల కింద నమోదు
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేసినందుకే కేసు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Police case on Payyavula Keshav: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదైంది. 341,188 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు రిజిస్ట్రర్ చేశారు ఉరవకొండ అర్బన్ పోలీసులు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులతో కలిసి ఆందోళనకు చేశారు టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. అంతకుముందు గుంతకల్లు బ్రాంచి కెనాల్ ఆయకట్టు రైతులతోనూ పయ్యావుల సమావేశమయ్యారు. రైతులతో కలిసి రహదారిపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయన్ను ఆరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇప్పుడు పయ్యావులపై కేశవ్ ఐపీసీ సెక్షన్లు 341,188 కింద కేసు నమోదు చేశారు.
జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు 300 కోట్ల రూపాయల విలువైన పంటలను నష్టపోతున్నారు. హంద్రీనీవా నీటిని పంటలు ఇవ్వకపోగా.. నీరు వృథాగా పోతుడటంతో రైతులు రగిలిపోతున్నారు. దీంతో.. రైతులకు మద్దతుగా నిలబడ్డారు పయ్యావుల కేశవ్. రైతులు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా? కాల్వ నిండా నీరు వెళ్తున్నా ఒక్క తడి ఇవ్వలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులతో కలిసి ఆందోళన చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నిలబడి నిలదీశారు. హంద్రీ-నీవా నీరు వృథాగా పోతుంటే రైతులకు కడుపు మండిపోతోందని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆందోళన చేస్తున్న పయ్యావులను పోలీసులు అరెస్ట్ చేశారు. పయ్యావులను అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పయ్యావులను అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అతికష్టం మీద ఆయన్ను కనేకల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు... ఆ తర్వాత విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు.
హంద్రీనీవా నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు సాగు నీటిని ఇవ్వాలంటూ ఆందోళన చేసిన పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు కూడా పయ్యావుల కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదన్నారు. రైతులకు హంద్రీనీవా నుంచి గుంతకల్ బ్రాంచ్ కెనాల్‌కు నీటిని ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంటున్నారు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.