By: Ram Manohar | Updated at : 04 Jul 2022 01:02 PM (IST)
భీమవరంలోని అల్లూరి సీతారామ విగ్రహావిష్కరణ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ( Image Source : ANI )
మిమ్మల్ని కలుసుకోవటం నా అదృష్టం: ప్రధాని మోదీ
భీమవరంలోని అల్లూరి సీతారామ విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు" అంటూ అల్లూరి సీతారామరాజు గొప్పదనాన్ని తెలుగులో చెబుతూ అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ పాటను గుర్తు చేశారు. అల్లూరి..స్వాతంత్ర్య సంగ్రామంతో యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సీతారామరాజు పుట్టిన ఈ నేలపై ఆంధ్రప్రజల్ని కలుసుకోవటం ఎంతో అదృష్టమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రదేశ ప్రజలు చేసిన ఆత్మబలిదానాలు, ఆదివాసీ ప్రజలు చూపిన తెగువ ఎంతో ప్రేరణనిచ్చింది. ఇంత గొప్పచోటుకు రావటం తన అదృష్టమని చెప్పిన ప్రధాని మోదీ...ఈ మట్టికి నమస్కరిస్తున్నానని అన్నారు. ఆజాదీకా అమృతక్ మహోత్సవం జరుపుకుంటున్న తరుణంలోనే అల్లూరి సీతారామరాజు 125వ జయంతినీ ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. రంప ఆదోళనకు వందేళ్లు పూర్తయ్యాయని, ఇన్ని చరిత్రాత్మక సంఘటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.
అల్లూరి సీతారామరాజు పాదాలకు నమస్కరిస్తున్నా..
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాదాలకు నమస్కరిస్తూ, దేశం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. ఆయన వారసులూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించటం సంతోషంగా ఉందని అన్నారు. ఈనేలపై జన్మించి, స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన ఆదివాసీలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాని చెప్పారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతితో పాటు వందేళ్ల రంప ఆందోళననూ ఈ ఏడాదంతా పండుగలా చేసుకోవాలని సూచించారు. అల్లూరి జన్మించిన పాండ్‌రంగి ప్రాంత అభివృద్ధితో పాటు మొగల్లులో ధ్యానమందిరం నిర్మిస్తామని స్పష్టం చేశారు. అల్లూరి నడయాడిన అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటం నాటి సంఘటనలను ప్రజలకు చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా అల్లూరితోనే ఈ యజ్ఞాన్ని ప్రారంభించటం తమ అదృష్టమని అన్నారు.
సీతారామరాజు జీవితయాత్ర మనందరికీ స్ఫూర్తిదాయకం..
భారత స్వాతంత్ర్య సమర చరిత్ర కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదని, ఇందుకోసం బలిదానం చేసిన అందరిదీ అని చెప్పారు. ఈ పోరాటం మన దేశంలోని భిన్నత్వాన్ని, సంస్కృతిని ప్రతిబించిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు కోట్లాది మంది ఆదివాసీల శౌర్యాన్ని ప్రతీక అని కొనియాడారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‌కు మాత్రమే కాకుండా విశ్వశాంతికీ ఆయనే ప్రతీక అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. సీతారామరాజు జననం నుంచి మరణం వరకూ సాగిన యాత్ర, మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని స్ఫష్టం చేశారు. ఆదివాసీల సుఖ, దు:ఖాల కోసం ఆత్మబలిదానం చేసిన మహా మనిషి అని అన్నారు. మనదే రాజ్యం అనే నినాదంతో ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని చెప్పారు. హైందవంలో ఉన్న సమభావం అనే భావన అల్లూరి సీతారామరాజుకి అబ్బిందని, అదే ఆయనను ఆ స్థాయిలో నిలబెట్టిందని స్పష్టం చేశారు.
పాతికేళ్లకే ఆత్మబలిదానం చేసిన యోధుడు..
విదేశీ అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన నాటికి అల్లూరి వయసు పాతికేళ్లు మాత్రమే. దేశం కోసం ఆయన 27 ఏళ్లకే అమరులయ్యారని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని చాలా మంది యువకులు ప్రాణదానం చేశారని, వాళ్లంతా మనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని అన్నారు. అప్పుడు ఎలాగైతే యువకులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారో, అదే ప్రేరణతో ఇప్పుడు కూడా యువత ముందుకొచ్చి దేశానికి సేవ చేయాల్సిన అవసరముందని అన్నారు. కొత్త ఆలోచనలు, అవకాశాలు వస్తున్న నేపథ్యంలో దేశాన్ని సరైన మార్గంలో నడిపేలా యువత ముందుండాలని ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్రం ఎందరో దేశభక్తులకుజన్మనిచ్చిందని అన్నారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య సహా పొట్టి శ్రీరాములు, కన్నెగంటి హనుమంతు లాంటి మహనీయులను ఈ నేల అందించిందని చెప్పారు.
ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయ్..
ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ధైర్య సాహసాలనూ గుర్తు చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ఈ 75 ఏళ్ల స్వాంతంత్ర్య మహోత్సవాలను అమృత కాలంగా భావించాలని, దేశం కోసం బలిదానం చేసిన వారందరినీ స్మరించుకోవాలని సూచించారు. యువకులు, రైతులు, వెనకబడి వర్గాలకు సమాన అవకాశాలు లభించే నవభారతాన్ని నిర్మించుకోవాలని చెప్పారు. అందుకు అనుగుణంగానే 8 ఏళ్లుగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఆదివాసీల భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకుని కేంద్రం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని వెల్లడించారు. ఆదివాసీల బలిదానం ఎంత గొప్పదో తెలియజేసే విధంగా దేశ నలుమూలలా విస్తరించేలా, ఆదివాసీల కోసం ప్రత్యేక సంగ్రహాలయాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌తో పాటు మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అదే విధంగా గతేడాది నవంబర్ 15న బిర్సా ముండా అనే మన్యం వీరుడి జయంతిని కూడా నిర్వహించామని గుర్తు చేశారు. ఆంగ్లేయులు ఆదివాసీల సంస్కృతిపై ఉక్కుపాదం మోపారని అన్నారు. ఆదివాసీ వర్గానికి చెందిన యువతకు ఉపాధి అవకాశాలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అడవే వారికి ఉపాధినిచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆదివాసీల కళ, కౌశలాన్ని పెంపొందించేలా స్కిల్ ఇండియా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
నవభారత నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు..
అడవిలో ఉండే వెదురుని కోసుకునే హక్కుని ఆదివాసీలకు గత ప్రభుత్వాలు కల్పించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక వారికి ఆ హక్కు కల్పించామని స్పష్టం చేశారు. ఇక్కడి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 90 అటవీ ఉత్పత్తులపై ఎమ్‌ఎస్‌పీని అందిస్తున్నట్టు చెప్పారు. ఆదివాసీ యువతకు నైపుణ్యాలు పెంచేందుకు అవకాశాలు కల్పించటమే కాకుండా, విశాఖలోనే ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించామని అన్నారు. వెనకబడిన మన్యం జిల్లాలకు లాభం
చేకూర్చుతామని హామీ ఇచ్చారు. ఇక్కడి వారికి మంచి విద్య అందించే ప్రయత్నాలనూ వివరించారు. మాతృభాషలో విద్యను నేర్చుకుంటే, ఆదివాసీ బిడ్డలకూ మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నవభారత నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Prashanth Neel: ఏపీలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రశాంత్ నీల్ భారీ సాయం, రఘువీరా ప్రశంసలు
Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం
AP CPS Issue : సీపీఎస్‌పై మిలియన్ మార్చ్‌కు ఏపీ ఉద్యోగులు రెడీ - ప్రభుత్వం ఏం చేయబోతోంది ?
Independence Day 2022: కోనసీమ జిల్లాలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవం, నాణెేలతో దేశ చిత్రపటం!
CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam
తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్ టు అమెరికా’అంటూ నినాదాలు
Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?
ITBP Bus Accident: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం
TROUBLE for Tejashwi Yadav : తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాక్ - ఆ కేసు మళ్లీ తెరపైకి !