Palnadu News : పింఛన్ కోసం మంత్రి అంబటిని ప్రశ్నించిన వ్యక్తి, వాలంటీర్ ఉద్యోగం ఊస్టింగ్!
Palnadu News : గడప గడపకు కార్యక్రమంలో ఓ వ్యక్తి మంత్రి అంబటి రాంబాబుతో గొడవపడ్డాడు. వాలంటీర్ వార్డులో వారిని తగిన విధంగా సిద్ధం చేయలేదని అధికారం చూపించారు మంత్రి అంబటి.
Palnadu News : మంత్రి అంబటి రాంబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. గడప గడప కు కార్యక్రమంలో వార్డులో వారిని ప్రివేర్ చేయలేదని ఓ వాలంటీర్ ను విధుల్లోంచి తొలగించారు. సత్తెనపల్లి వావిలాలనగర్‌లో గడప గడపకు కార్యక్రమం నిర్వహిచారు మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్బంగా పలు కుటుంబాలను కలిసి ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీతమ్మ అనే మహిళ తనకు వచ్చే వితంతు పింఛన్ ను రద్దు చేశారని తెలిపింది. సీతమ్మ కుమారుడు వెంకటేశ్వర్లుకు కారు ఉండటం వల్ల పింఛన్ రద్దు చేసినట్లు వాలంటీర్ తెలిపారు. మంత్రితో ఈ విషయంలో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు. గడప గడప కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో వాలంటీర్ వార్డులో వారిని సరిగా సిద్ధం చేయలేకపోయాడని..తమకు అనుకూలంగా మాట్లాడే విధంగా ప్రిపేర్ చేయలేకపోయాడంటూ తక్షణం వాలంటీర్ ఆకుల శ్రీకాంత్ ను తొలగించాలంటూ ఆదేశం ఇచ్చారు మంత్రి అంబటి. వార్డులో సమస్యలు అడగకుండా ఎలా ఉంటారు. తనకి సంబంధం లేని విషయంలో ఆరోపణలు చేసి తన ఉద్యోగం నుంచి తొలగించారని లబోదిబో అంటున్నాడు వాలంటీర్ శ్రీకాంత్.
అన్యాయంగా తొలగించారు
"నేను 31వ వార్డు వాలంటీర్ ను. మొన్న గడప గడపకు కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఒక వ్యక్తి వాళ్ల అమ్మకు పింఛన్ రాలేదని మంత్రితో గొడవ పడ్డాడు. అయితే మంత్రి అంబటి రాంబాబు వాలంటీర్ ఎవరు అని కొనుక్కొన్ని నన్ను విధుల్లోంచి తొలగించారు. ఆయన గొడవపడే విషయం నాకు ముందుగా తెలియదు కదా. నన్ను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారు. నేను అంబటి రాంబాబు గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాం. అయినా మాకు ఏంచేయలేదు. ఏదో చిన్న ఉద్యోగం వాలంటీర్ గా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా తొలగించారు. " - ఆకుల శ్రీకాంత్
ఎంపీటీసీ ఆగ్రహం
మంత్రి అంబటి రాంబాబుపై ఎంపీటీసీ విజయలక్ష్మి ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీ విజయలక్ష్మికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గొడవ మెదలైంది.హెడ్ మాస్టర్ వనజాతో ఎంపీటీసీ వాగ్వివాదానికి దిగారు. ఇదే సమయంలో మంత్రిని ఉద్దేశించి ఎంపీటీసీ విజయలక్ష్మి తీవ్ర పదజాలంతో దూషించారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు గ్రామంలో పెత్తనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అంతే కాదు మంత్రి అంబటిని ఏకవచనంతో సంభోదించి మాట్లాడుతూ, చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు పిల్లల ముందే ఎంపీటీసీ విజయలక్ష్మి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థులు షాకయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఈ వ్యవహరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలోని పెద్దలకు వీడియోలు చేరాయి.
మంత్రి అంబటికి వరుస షాక్ లు
సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటికి వరుసగా షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన అనుచరులు లాటరీ టిక్కెట్ ల నిర్విహించడంతో కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటిపై కేసు నమోదయ్యింది. అంతే కాదు గతంలో మహిళల వ్యవహరంలో అంబటిపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం చెక్కు ఇచ్చినందుకు రెండు లక్షల రూపాయలు లంచం అంబటి అడిగారని బాధితులు ఆరోపించడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఇలా వరుస ఘటనలతో అంబటి రాంబాబు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నారు. అంబటి పై పార్టీ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం సైతం జరుగుతోంది. నియోజకవర్గంలో తమను కాదని వేరొకరికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.