(Source: ECI/ABP News/ABP Majha)
Payyavula : కేబినెట్ హోదా కోసమే - రూల్ బుక్ చదువుకోవాలి - జగన్‌కు పయ్యావుల స్ట్రాంగ్ కౌంటర్
Minister Payyavula Kesav : ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న జగన్‌కు పయ్యావుల ఘాటు కౌంటర్ ఇచ్చారు. సలహాదారులను మార్చుకుని రూల్స్ బుక్ చదువుకోవాలన్నారు.
Payyavula Kesav counter : జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా తాము కాదని ప్రజలే ఇవ్వలేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ రాసిన లేఖపై స్పందించారు. జగన్‌మోహన్ రెడ్డి తప్పుడు సమాచారంతో లేఖలు రాశారని ఆయన రూల్ బుక్ చదవాలని సూచించారు. ఆయన చదవకపోతే మనుషుల్ని పెట్టి చదివించుకోవాలన్నారు. లేఖ రాసిన సలహాదారుడ్ని కూడా మార్చుకోవాలని అందులో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. గతంలో పది శాతం ఎమ్మెల్యేలు లేకపోయినా పి జనార్ధన్ రెడ్డిని ప్రతిపక్షనేతగా గుర్తించారంటూ లేఖలో రాశారని.. తెలియకపోతే తెలుసుకోవాలన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మాత్రమేననన్నారు. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. లోక్‌సభలో పి ఉపేంద్రను ప్రతిపక్షనేతగా గుర్తించారని జగన్ చెప్పడం కూడా తప్పేనన్నారు.
సభలో కోరానికి తగ్గ బలం ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని పయ్యావుల స్పష్టం చేశారు. వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్షంగా జగన్ ఉంటారని.. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు మాత్రం ఉండదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుందని ఆ హోదా కోసమే జగన్ లేఖలు రాస్తున్నారని పయ్యావుల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు సలహా దారులను పెట్టుకోని నీకు ఈ గతి పట్టింది జగన్.. మళ్లీ అదే సలహాదారులతో స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఉన్నావు.. ఇలాగే ఉంటే నీ రాజకీయం ఇంకా దారుణంగా ఉంటుందని సలహా ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ప్రతిపక్షనేత ప్రమాణ స్వీకారం చేయాలని చెబుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభ నియమాలు తెలుసా అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కోసం రావాల్సిన కనీస మెజార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి లేరని.. అలాంటప్పుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎలా అడుగుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కోరం లేకుండా ప్రతిపక్ష నేత హోదా తీసుకోవాలని జగన్ కు సలహా ఇచ్చిందెవరో వాళ్లు విషయం తెలుసుకుంటే మంచిదని సూచించారు. వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖలోని అన్ని అంశాలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పారు. అన్నీ తప్పుడు సమాచారమేనని, సభ విలువలు, సంప్రదాయాల మీద నడుస్తుందని చెప్పుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేత అని జగన్ చెబుతున్నారు. అధికార పార్టీ కాకుండా ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీ నేతే ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని పది శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని .. స్పీకర్ కు లేఖ రాశారు. కేంద్రం ఈ సారి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉన్నారు. అంతకు ముందు రెండు సార్లు కూడా ప్రధాన ప్రతిపక్ష నేత లేరు. కాంగ్రెస్ పక్ష నేతకు సంఖ్యాబలం లేకపోవడంతో ఆ హోదా ఇవ్వలేదు. కానీ జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని లేఖలు రాస్తున్నారు.