Onion Price Raise: సామాన్యులకు షాక్ - ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, అదే కారణమా?
Onion price Raise: ఏపీలో రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధాన మార్కెట్లలో కిలో రూ.60 నుంచి రూ.86 వరకూ పలుకుతోంది.
మొన్నటి వరకూ టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఏకంగా కిలో రూ.200కు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే టమాటా ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఉల్లి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఏపీలోని అన్ని మార్కెట్లలోనూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కిలో ధర ఎంతంటే.?
రిటైల్ మార్కెట్ లో సైజుతో పని లేకుండా ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.86 వరకూ విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, ఇతర మాల్స్ లో కిలో రూ.90 వరకూ పలుకుతోంది. రైతు బజారుల్లో సైతం ప్రాంతాల వారీగా కిలో ఉల్లి ధర రూ.38 నుంచి రూ.46 వరకూ పలుకుతోంది.
ఇవే కారణాలా.!
జూన్, జులై నెలలో కిలో రూ.20 నుంచి రూ.25 ఉన్న ధర, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో కిలో రూ.35 వరకూ పలికింది. సాధారణ పరిస్థితుల్లో అక్టోబర్, నవంబర్ నెలల నుంచి ఉల్లి ధరలు పూర్తిగా సామాన్యులకు అందుబాటులో ఉంటాయని, అయితే, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వాతావరణం అనుకూలంగా లేక దిగుబడి తగ్గి ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన దిగుబడి
ఉల్లి సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతయ్యేది. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కర్నూలు మార్కెట్‌కు 1.95 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు రాగా, ప్రస్తుతం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం 70,377 క్వింటాళ్లే వచ్చింది. ఆగస్టు, సెప్టెంబరులో దిగుబడులు తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి అక్టోబర్ వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు, ఉష్ణోగ్రతలు పెరగడం కూడా దిగుబడి తగ్గడానికి కారణమైంది. దిగుబడి బాగా ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్, పుణె తదితర ప్రాంతాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు రోజుకు 6-8 లారీలు వచ్చేవి. గత కొన్నిరోజులుగా 2-3 లారీలకు మించి రావడం లేదు. అననుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరాకు 50 ప్యాకెట్లు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు వచ్చే ఉల్లి 25 క్వింటాళ్లకు పడిపోయింది.
కర్నూలు మార్కెట్ ధర ఎంతంటే.?
ఈ ఏడాది ఉల్లి ధరలు బాగానే ఉన్నా, దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్ కమిటీ దాదాపు రూ.2 కోట్ల మేర ఆదాయం కోల్పోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 777 క్వింటాళ్ల ఉల్లి రాగా, క్వింటా కనిష్ట ధర రూ.2,501, మధ్యస్థ ధర రూ.4,419, గరిష్ట ధర రూ.5,318 పలికింది. గతేడాది ఉల్లి దిగుబడులు భారీగా వచ్చినా ఈ మార్కెట్ లో ఉల్లికి ధర లేని కారణంగా సెస్సు రూపంలో మార్కెట్ కమిటీ రూ.కోటి మేర ఆదాయం కోల్పోయింది.
ఈ కారణాలతో ఉల్లి ధరలు క్రమంగా రోజురోజుకూ ప్రధాన మార్కెట్లలో పెరుగుతూ వస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోందని వాపోతున్నారు. ధరలు తగ్గించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.