AP EAPCET 2021: ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించింది.
కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం పలు రంగాలపై ప్రభావం కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు జాతీయ ఎంట్రన్స్ పరీక్షలలో, వాటి ఫలితాల విధానాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు కరోనా సెకండ్ వేవ్ అవరోధంగా మారడం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీలలో ప్రవేశాలకు ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో ఏపీ ఉన్నత విద్యా మండలి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. గత ఏడాది వరకు ఈ ఎంట్రన్స్ పరీక్షలలో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది ఇంటర్ వెయిటేజీని తొలగించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది.
గతానికి భిన్నంగా ఈ ఏడాది నిర్వహించనున్న ఈఏపీసెట్ ఫలితాన్ని 100శాతం రాత పరీక్ష మార్కులతో ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశాలు పొందుతారని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ ప్రభుత్వం సైతం ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. ఈ కారణంగా ఈ ఒక్క సంవత్సరం మాత్రం ఈఏపీసెట్ ఫలితాలలో 25 శాతం ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ తొలగిస్తూ నిర్ణయం తీకున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలలో ఇంటర్ వెయిటేజీ గతంలో తరహాలో పరిగణనలోకి రానుంది.
కాగా, ఈఏపీసెట్-2021ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్- గతంలోనే ప్రకటించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశాల కోసం గతంలో ఎంసెట్ నిర్వహించేవారు. గత కొన్నేళ్లుగా మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాంతో ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్పులు చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల విడుదల చేశారు. దరఖాస్తు అందరూ విద్యార్థులను పాస్ చేసినట్లు ప్రకటించారు. అయితే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇంటర్ ఫస్టియర్‌లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీతో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యా శాఖ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో ఈ ఏడాదికిగానూ ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించారు.