AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
AP Liquor Policy | ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఇదివరకే మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది.
Andhra Pradesh Liquor shop Timings in AP | అమరావతి: ఏపీలో నూతన మద్యం పాలసీకి ఇటీవల ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించింది. లాటరీ డ్రా నిర్వహించి మద్యం షాపులను విజేతలకు కేటాయించారు. ఏపీలో నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. అక్టోబర్ 16 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది. కొత్త పాలసీలో భాగంగా మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉండనున్నాయి. తక్కువ ధరకే మద్యం విక్రయాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. గత ఐదేళ్లుగా అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ సైతం చేయవచ్చు. దాంతో నగదు చెల్లింపు సమస్యకు చెక్ పెట్టింది కూటమి ప్రభుత్వం. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మద్యం షాపు నిర్వాహకులను హెచ్చరించారు.
లక్కీ డ్రా లాటరీతో మద్యం షాపులు కేటాయించిన ప్రభుత్వం
ఏపీలో మద్యం షాపుల కేటాయింపు సోమవారం జరిగింది. 3,396 షాపులకుగానూ 89,882 అప్లికేషన్లు రాగా, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని అక్టోబర్ 14న ప్రకటించారు. మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులతో పాటు కొన్నిచోట్ల మద్యం షాపుల విజేతలు కిడ్నాప్ అయ్యారని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మద్యం షాపుల కేటాయింపుపై జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం షాపులను స్వేచ్ఛగా, ఎలాంటి భయాలు లేకుండా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వానికి రూ.1,797 కోట్లు ఆదాయం
రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని లిక్కర్ షాపుల కోసం దరఖాస్తుదారులు చెల్లించారు. లాటరీలో లక్కీ డ్రా తీసిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల విజేతల్ని ప్రకటించారు. లైసెన్స్ ఫీజు చెల్లించిన వారికి ప్రొవిజనల్ లైసెన్సులు సైతం అందజేశారు. మద్యం షాపులు గెలుచుకున్న వారు వచ్చే రెండేళ్లు నిర్వహణకు అనుమతి ఉంటుంది. తాజాగా జరిగిన లిక్కర్ షాపుల దరఖాస్తు ప్రక్రియతో రూ.1797.64 కోట్లు ఏపీ ప్రభుత్వ ఖజానాకు చేరాయి.
Also Read: AP Liquor Shops: మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!
తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ వాసులకు ఏపీ లిక్కర్ షాపులు
ఏపీలో జరిగిన లిక్కర్ షాపుల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన వారితో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల నుంచి పలువురు టెండర్లు వేసి రాష్ట్రంలో లిక్కర్ షాపులను సొంతం చేసుకున్నారు. లైసెన్స్ ఫీజులు చెల్లించి ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకున్న వారు మంగళవారం (అక్టోబర్ 15న సాయంత్రం) డిపోలో స్టాక్ తీసుకుంటున్నారు. బుధవారం (అక్టోబర్ 16) నుంచే ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని మై హోం భుజాలోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ వినాయకచవితి సమయంలో గణేష్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఏపీలో లిక్కర్ షాపుల్లో ఆయన 4 వరకు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది.