MLA Anilkumar: శునకానందం బ్యాచ్, రాసిపెట్టుకోండి - మాజీ మంత్రి అనిల్ ఘాటు వ్యాఖ్యలు
ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ముందుగానే అనిల్ తన సీటుపై అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ప్రకటన చేశారు..? ఒకవేళ సీఎం జగన్ దగ్గరనుంచి అంత బలమైన హామీ ఉందా..?
ఏమో నాకు టికెట్ రాదేమో, నా భార్యను ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించొచ్చేమో అంటూ వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి వారు వేదాంతం వల్లె వేస్తున్నారు. మరోవైపు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మాత్రం బస్తీమే సవాల్ అంటూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. నెల్లూరులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే రాసిపెట్టుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్.
అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసి పెట్టుకోండి అంటూ కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వచ్చే దఫా అనిల్ నియోజకవర్గం మారుస్తారని పుకార్లు ప్రచారం కావడంతో అనిల్ ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. టీ బంగుల దగ్గర మాట్లాడే అందరికీ కూడా ఇదే చెప్తున్నా.. అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు అని అన్నారాయన. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గీసిన గీత దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నానని అన్నారు. తాను రాష్ట్రంలో తలవంచేది ఒకే ఒక్క జగన్ కి అని స్పష్టం చేశారు.
ఎందుకీ వ్యాఖ్యలు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అనిల్ పోటీ చేయట్లేదు అని పార్టీ తరపున ఎవరూ చెప్పలేదు, అసలా ప్రస్తావన కూడా పార్టీ వర్గాల్లో రాలేదు. కానీ అనిల్ ఎందుకో ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. టీ బంకుల దగ్గర చేరి మాట్లాడుకునేవారు కూడా గుర్తుంచుకోండి అంటూ కాస్త హెచ్చరించినట్టుగానే చెప్పేశారు. తనను వీడి వెళ్లిపోతున్నవారందరికీ ఇది పరోక్షంగా వార్నింగేనంటున్నారు అనిల్. అందుకే ముందుగానే ఈ విషయం చెబుతున్నానని అన్నారు.
నెల్లూరు సిటీలో అనిల్ కి వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ వర్గం పావులు కదుపుతోంది. ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేటర్లలో చీలిక వచ్చింది. సగం మంది అనిల్ వర్గం, సగం మంది రూప్ కుమార్ వర్గంలో చేరిపోయారు. ఇటీవలే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా ఈ బ్యాచ్ లోనే కలిసిపోయారు. దీనికితోడు.. ఇరుగు పొరుగు నియోజకవర్గాల వారు కూడా అనిల్ కి వ్యతిరేకంగా గూడుపుఠానీ నడుపుతున్నారనే అనుమానం ఆయనలో ఉంది. అందుకే వారందరికీ ఇప్పుడు ఒకేసారి సమాధానం ఇచ్చేశారు మాజీ మంత్రి అనిల్. వచ్చేసారి తనకు టికెట్ రాదు అని కొంతమంది శునకానందం పొందుతున్నారని, వారంతా సీటు ప్రకటించే వరకు హాయిగా నిద్రపోవచ్చని, తనకు సీటు వచ్చాక ఎలాగూ వారికి నిద్ర ఉండదని అన్నారు అనిల్.
ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ముందుగానే అనిల్ తన సీటుపై అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ప్రకటన చేశారు. ఒకవేళ సీఎం జగన్ దగ్గరనుంచి అంత బలమైన హామీ ఉందా, లేక ఆయనది అతి విశ్వాసమా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడైతే సిట్టింగ్ ల గురించి సీఎం జగన్ ఎప్పుడూ బహిరంగ చర్చ చేయలేదు. గడప గడప కార్యక్రమంలో మరింత చురుగ్గా ఉండండి అని మాత్రమే చెప్పారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను మార్చి.. సిగ్నల్స్ ఇచ్చారు. నెల్లూరు సిటీకి సంబంధించి ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ అధిష్టానం వద్ద లేదు. అందుకే అనిల్ అంత ధీమాగా తన సీటు గురించి ప్రకటించారని అంటున్నారు పార్టీ నేతలు.