నెల్లూరులో రాజన్న భవన్‌కు పోటీగా జగనన్న భవన్- అనిల్, రూప్ కుమార్ పొలిటికల్ గేమ్‌లో అప్‌డేట్ వెర్షన్
అనిల్ ఆఫీస్ కి పోటీగా.. రూప్ కుమార్ కొత్త ఆఫీస్ ప్రారంభించారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు. ఇకపై నెల్లూరు సిటీలో ఇది మరో కొత్త పవర్ సెంటర్ గా మారబోతోంది.
నెల్లూరు సిటీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కి పోటీగా మరో వర్గం అక్కడ పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతోంది. ఆ మధ్య సీఎం జగన్ దగ్గర పంచాయితీ జరిగినా వ్యవహారం సద్దుమణగలేదు. ఇప్పుడు నెల్లూరు సిటీ వైసీపీలో రెండో పవర్ సెంటర్ రెడీ అయింది. ఎమ్మెల్యే అనిల్ ఆఫీస్ పేరు రాజన్న భవన్ అయితే, రెండో పవర్ సెంటర్ పేరు జగనన్న భవన్. అనిల్ వ్యతిరేక వర్గమంతా ఇక్కడకు చేరుకుంది. రూప్ కుమార్ యాదవ్ ఆఫీస్ గా జగనన్న భవన్, నెల్లూరు వైసీపీలో సరికొత్త రాజకీయ వేదికగా మారుతోంది.
నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ ఆఫీస్ రాజన్న భవన్ కి పోటీగా జగనన్న భవన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి జగనన్న భవన్ అని, ఈ భవనం ప్రారంభోత్సవం సంతోషంగా ఉందని అన్నారు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఇటీవల అనిల్ తో వచ్చిన విభేదాలతో రూప్ కుమార్ టాక్ ఆఫ్ ది సిటీగా మారారు. ఆమధ్య సీఎం జగన్ సయోధ్య చేసినా అనిల్, రూప్ కుమార్ తాము కలిసేదే లేదని చెప్పారు. ఇప్పుడు అనిల్ ఆఫీస్ కి పోటీగా.. రూప్ కుమార్ కొత్త ఆఫీస్ ప్రారంభించారు. ఈ ఆఫీస్ కి అనిల్ వ్యతిరేక వర్గం హాజరైంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు. ఇకపై నెల్లూరు సిటీలో ఇది మరో కొత్త పవర్ సెంటర్ గా మారబోతోంది.
అనిల్ వర్సెస్ రూప్..
అనిల్, రూప్ కుమార్ మధ్య చాన్నాళ్లు పరోక్ష యుద్ధం జరిగింది. ఇటీవల ఇద్దరూ బయటపడ్డారు. నీ గుట్టు మట్లు నాకు తెలుసు అంటే, నీ జాతకం నా దగ్గర ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేసుకున్నారు. అయితే ఇద్దరూ అక్కడితో ఆగిపోయారు. ఎవరు నోరు తెరిచినా అంతిమంగా పార్టీకి నష్టం కాబట్టి, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నెల్లూరు సిటీలో అనిల్ కి టికెట్ దక్కనీయకుండా రూప్ కుమార్ పావులు కదుపుతున్నారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ తొలి కేబినెట్ లోనే మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ కి ఇది నిజంగా పరీక్షా సమయమే అని చెప్పాలి. సొంత ఊరిలోనే అందులోనూ సొంత కుటుంబంనుంచే ఆయనకు శత్రువులు బయలుదేరారు. దీంతో అనిల్ కి రాజకీయ ఉక్కపోత మొదలైంది. రూప్ కుమార్ కి సిటీలో మంచి పట్టు ఉంది. ఆయన నేరుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించకపోయినా.. అనిల్ కి రాకుండా చేస్తే సగం విజయం సాధించినట్టే అనుకుంటున్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పార్టీపట్ల విధేయత ప్రదర్శిస్తూనే అనిల్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు.
నెల్లూరులో అనిల్ ని ఒంటరి చేయాలనే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మంత్రి కాకాణితో అనిల్ కి పంచాయితీ ఉంది, అటు ఎంపీ ఆదాలతో కూడా అనిల్ కి సఖ్యత లేదని అంటారు. అయితే అప్పుడప్పుడు వారిద్దరూ కలవడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్టే చెప్పుకోవాలి. కానీ సొంత నియోజకవర్గంలోనే ఇప్పుడు అనిల్ వ్యతిరేక వర్గం ఆఫీస్ కూడా ప్రారంభించి పని మొదలు పెట్టిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు వర్గాలు కలసిపోతేనే నెల్లూరులో వైసీపీ బలంగా ఉంటుంది. లోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలే ప్రమాదం ఉంది.