బర్త్‌డే సందర్భంగా చంద్రబాబు ప్రకటించే ఆ కార్యక్రమం ఏంటీ?
పుట్టినరోజు ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్న చంద్రబాబు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రకటిస్తానంటూ చెప్పారు. ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటన్న చర్చ టీడీపీలో నడుస్తోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ తన 73వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అక్కడే వేడుకలు చేసుకోవాలని నిర్ణయించారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన... పుట్టిన రోజు సందర్భంగా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నట్టు ప్రకటించారు. తన జీవితంలో మర్చిపోలేని కార్యక్రమాన్ని ప్రకటిస్తానంటూ చెప్పడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.
పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు చేపట్టే ఆ కార్యక్రమం ఏంటన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. రెండు రోజులుగా ప్రకాశఁ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజల కోసం బటన్ నొక్కుతున్నానని చెబుతున్న జగన్... కోట్లు నొక్కేస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి గంజాయి ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
గిద్దలూరులో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ఓ క్యాన్సర్ గడ్డలా మారారని ఎద్దేవా చేశారు. ఏదో ఊహించుకొని ఒక్క అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని తన సొంతానికి వాడుకున్నారని జనం సమస్యలు మాత్రం తీర్చలేదన్నారు. నిత్యవసరాలు, చమురు ధరలు, బస్, విద్యుత్ ఛార్జీలు అన్నింటితో ప్రజలను బాదేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరకు చెత్తపై కూడా పన్ను వేశారని ఇలాంటి చెత్త ముఖ్యమంత్రి ఎక్కడా లేరని అన్నారు.
వైసీపీకి ఎక్స్‌పెయిరీ డేట్ వచ్చేసిందన్నారు చంద్రబాబు. ఇక ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్లే అన్నారు. ఇక మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవ్వడమనేది జరగదన్నారు. జగన్ ఇడుపుల పాయకు వెళ్లాల్సిన టైంలో విశాఖ వెళ్తున్నానంటూ పగటి కలలు కంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో జగన్ లక్షల కోట్లు వెనకేసుకుంటే.. ప్రజలపై లక్షల కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. విద్యార్థులకు బాకీలు ఇవ్వడంలేదని, ఉద్యోగులకు జీతాలు, పోలీసులకు డీఏలు ఇవ్వడం లేదన్నారు.
పుట్టిన రోజు సందర్బంగా చంద్రబాబుకు చాలా మంది ట్విట్టర్ వేదిగా శుభాకాంక్షలు చెప్పారు.
Wishing a very happy birthday visionary leader Sri Nara Chandrababu Naidu garu ! @ncbn ✨🤗🤗 pic.twitter.com/J6qOWoqOwT
— Gopichandh Malineni (@megopichand) April 20, 2023
టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2023





















