Nellore News : గ్రేస్ మార్కులు వద్దు, కష్టపడి చదువుతామంటున్న పదో తరగతి విద్యార్థులు
ఏపీలో ప్రతిపక్షాలు టెన్త్ పిల్లలకు గ్రేస్ మార్కులు ఇవ్వండి, పాస్ చేయండి.. అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. అయితే ఫెయిలైన పిల్లల్లో కొంతమంది తమకు గ్రేస్ మార్కులు వద్దంటున్నారు.
ఇటీవల ఏపీలో ప్రతిపక్షాలు టెన్త్ పిల్లలకు గ్రేస్ మార్కులు ఇవ్వండి, పాస్ చేయండి.. అంటూ డిమాండ్ చేశాయి.అయితే ఫెయిలైన పిల్లల్లో కొంతమంది తమకు గ్రేస్ మార్కులు వద్దంటున్నారు. ప్రభుత్వం ఎలాగూ సప్లిమెంటరీ పరీక్షలు పెడుతోంది. అందులో పాస్ అయితే కంపార్ట్ మెంటల్ అని కాకుండా గ్రేడ్లు ఇస్తామంటోంది. ఇంకేంటి అభ్యంతరం. అందుకే తాము సప్లిమెంటరీ రాసి కచ్చితంగా పాస్ అవుతామంటున్నారు విద్యార్థులు. గ్రేస్ మార్కులు అవసరం లేదని చెబుతున్నారు.
గతంలో ఎప్పుడూ లేనట్టుగా టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజీ పడిపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వమే ఫెయిలైన విద్యార్థులకోసం స్పెషల్ క్లాస్ లు నడుపుతోంది. ఈరోజు నుంచి ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో రెమెడియల్ క్లాస్ ల పేరుతో ఫెయిలైన విద్యార్థులకు క్లాస్ లు మొదలు పెట్టారు టీచర్లు. రాష్ట్రవ్యాప్తంగా 13వ తేదీ మొదలైన రెమెడియల్ క్లాస్ లు వచ్చే నెల పరీక్షలు మొదలయ్యే వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే డీఈవో కార్యాలయాల నుంచి టైమ్ టేబుల్ విడుదలైంది. ప్రతి రోజూ ఆయా సబ్జెక్ట్ ల టీచర్లు పిల్లలతో సిలబస్ రివిజన్ చేయిస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో కచ్చితంగా విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులు చేయిస్తామని చెబుతున్నారు టీచర్లు.
విద్యార్థులు సైతం ఉత్సాహంగా ఈ రెమెడియల్ క్లాస్ లకు హాజరవుతున్నారు. తొలిరోజు స్పందన కాస్త తక్కువగా ఉన్నా.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి క్లాస్ లకు వచ్చేలా చేస్తున్నారు ఉపాధ్యాయులు. అయితే విద్యార్థులు మాత్రం ఒకటీ రెండు మార్క్ లు తక్కువయినా తమకు గ్రేస్ మార్క్ లేవీ వద్దని కష్టపడి చదివి సప్లిమెంటరీలో పాసవుతామని చెబుతున్నారు. ఒక్క మార్క్ తో ఫెయిలైన వారు కూడా తమకు గ్రేస్ మార్క్ లు వద్దని రీకౌంటింగ్ కూడా వద్దంటున్నారు.
పదో తరగతి ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 13 నుంచి ఆయా స్కూళ్లలో ప్రత్యేత తరగతులు జరుగుతున్నా. రోజుకి రెండు సబ్జెక్ట్ లపై బోధన ఉంటుంది. ఆయా సబ్జెక్టులలో ఫెయిలైన విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. డీఈవోలు సమీక్ష నిర్వహించాలని 13వతేదీ నుంచి టైమ్ టేబుల్ అమలు చేస్తున్నారు.
6,15,908మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరు కాగా.. 2,01,627మంది ఫెయిలయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం స్పెషల్ క్లాస్ లు మొదలయ్యాయి. ఫెయిలైన విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యే బాధ్యతను హెడ్ మాస్టర్లకు అప్పగించారు. గూగుల్ ఫామ్ ద్వారా రోజువారీ అటెండెన్స్ పై కూడా నివేదికలు ఇస్తున్నారు. రెమిడియల్ తరగతులు ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు.