Chandrababu: నెల్లూరులో టీడీపీ కట్టప్పలకు చంద్రబాబు మొట్టికాయలు.. జీరో స్కోరేంటని ఆగ్రహం..!
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పట్టు నిలుపుకుంది. నెల్లూరు లాంటి చోట్ల టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోవడంతో చంద్రబాబు నెల్లూరు పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్నారు.
ఇటీవల ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పట్టు నిలుపుకుంది. నెల్లూరు లాంటి చోట్ల ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. నెల్లూరు నగర కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో టీడీపీ స్కోరు జీరో. దీంతో సహజంగానే అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరులో పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్నారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అవినీతి చేసిందని, అభ్యర్థుల్ని కూడా కొనేసిందని స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబు ఎదుట ఆరోపించారు. మరి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అధికారంలోనే ఉంది కదా.. అన్ని చోట్లా అలాంటి పరిస్థితి ఎందుకు లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటీవల నెల్లూరు జిల్లా నాయకులతో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారట. రాష్ట్రమంతా టీడీపీ కొద్దో గొప్పో ప్రభావం చూపించినా, నెల్లూరులో మరీ ఒక్కరు కూడా ఎందుకు నెగ్గలేదని.. జీరోకు పడిపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టిపెట్టాలని స్థానిక నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని సమాచారం.
ఆ ముగ్గురిపై వేటు..
అధికార పార్టీతో కుమ్ముక్కై, సొంత పార్టీ అభ్యర్థులను దెబ్బ తీసినందుకు ముగ్గురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆ ముగ్గురిపై వేటు వేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారట. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడతాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేలూరు రంగారావు, కిలారి వెంకటస్వామి నాయుడు, పమిడి రవి కుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మహిళా నేత తాళ్లపాక అనురాధ, జెన్ని రమణయ్యల పనితీరుపై కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పనితీరు మార్చుకోకపోతే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట.
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జి అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కూడా చంద్రబాబు మందలించారని తెలుస్తోంది. వారిద్దరినీ నమ్మి పార్టీ వ్యవహారాలను అప్పగించి, కార్పొరేషన్ ఎన్నికలను ఎదుర్కోవాలని సూచిస్తే.. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నీ తానై చూసుకున్నారు. పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సహా మరికొందరు కీలక నేతలు కూడా ప్రచారానికి వచ్చారు. అయితే చివరి నిముషంలో కొంతమంది అభ్యర్థులే ఓటమిని అంగీకరించి వైఎస్సార్ సీపీ వైపు వెళ్లిపోవడంతో.. టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. మాజీ మంత్రి నారాయణ ఆర్థిక సాయం చేసినా ఫలితం లేదు. దీంతో చంద్రబాబు నెల్లూరు నగరంలో గతంలో నియమించిన డివిజన్ కమిటీలు అన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘పార్టీలో కట్టప్పలు, కోవర్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని అన్నారు. ఓ దశలో ప్రత్యర్థులతో కుమ్మక్కై.. నెల్లూరులో టీడీపీని ముంచేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది.
Also Read: Omicron in AP: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు.. ఐర్లాండ్ నుంచి వచ్చి.. తిరుపతి సహా ఈ ప్రాంతాల్లో సంచారం