Nellore Politics: జగన్ మాస్టర్ ప్లాన్- మైనార్టీ ఓట్లకోసం నెల్లూరు టీడీపీ ఆపసోపాలు!
Andhra Pradesh: రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీపీఆర్ రంగంలోకి దిగారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంట బెట్టుకుని ఆయన ముస్లిం మత పెద్దలను కలిశారు.
AP Elections 2024: నెల్లూరు జిల్లాలో మైనార్టీ ఓట్లు మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తాయి. అందులో నెల్లూరు సిటీ కూడా ఉంది. నెల్లూరు సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని పక్కకు తప్పించి ఆ స్థానంలో మైనార్టీ నేత ఖలీల్ ని తెరపైకి తెచ్చారు సీఎం జగన్. టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉన్నారు. నారాయణకు ప్రత్యర్థిగా నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ బలహీనంగా కనిపించినా.. ఆయన వెనక మైనార్టీ వర్గం ఉండటం మాత్రం ప్రధాన బలంగా మారింది. అంటే నెల్లూరు సిటీలో దాదాపుగా మైనార్టీ ఓట్లను టీడీపీ వదిలేసుకోవాల్సిన పరిస్థితి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక తర్వాత అక్కడ సీన్ మారినట్టు కనపడుతోంది. నెల్లూరులో మైనార్టీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీపీఆర్ రంగంలోకి దిగారు.
మైనార్టీ ఓట్లు ఏకపక్షంగా పడతాయా..?
నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలో మైనార్టీ ఓట్లు గణనీయంగా ఉన్నా.. అవి ఏకపక్షంగా పడతాయా అనేది మాత్రం అనుమానమే. అదే నిజమైతే గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి అబ్దుల్ అజీజ్ పోటీ చేశారు. ఆయనకు మైనార్టీ ఓట్లు గంపగుత్తగా పడలేదు. అందుకే అజీజ్ ఓడిపోయారు. ఇప్పుడు నెల్లూరు సిటీ విషయానికొచ్చేసరికి పరిస్థితిలో మార్పు కనపడుతోంది. టీడీపీ కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంటే బీజేపీని కూటమిలో చేర్చుకున్న టీడీపీ కూడా మైనార్టీలకు శత్రువుగా కనపడుతోంది. సో.. మైనార్టీ వర్గం ఓట్లు వైసీపీకే పోలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ నెల్లూరు సిటీలో వైసీపీనుంచి మాత్రమే మైనార్టీ అభ్యర్థి ఉన్నారు. తమ వర్గం అభ్యర్థిపై ఉన్న అభిమానం ఓవైపు, బీజేపీపై ద్వేషం మరో వైపు.. వెరసి నెల్లూరు సిటీలో మైనార్టీ ఓట్లు టీడీపీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకే ఆ పార్టీ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
రంగంలోకి వీపీఆర్..
రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీపీఆర్ రంగంలోకి దిగారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంట బెట్టుకుని ఆయన ముస్లిం మత పెద్దలను కలిశారు. నెల్లూరు నగరంలోని జామియా నోరుల్ హుదా మదర్సా కు వెళ్లిన వారు.. ముస్లిం మతపెద్ద అబ్దుల్ వహాబ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
ఒక రకంగా జగన్ వ్యూహంతో మైనార్టీ ఓట్ల విషయంలో టీడీపీ ఇబ్బంది పడుతోంది. నెల్లూరు సిటీలో మైనార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో.. ఆ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై కూడా పడే అవకాశముంది. మైనార్టీ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేయగలవు అనుకుంటున్న రెండు మూడు నియోజకవర్గాల్లో వారి ఓట్లు వన్ సైడ్ గా వైసీపీకి పడితే టీడీపీకి ఊహించని నష్టం జరుగుతుంది. దాన్ని నివారించడానికి టీడీపీ చెమటోడుస్తోంది. మైనార్టీ నేతలను కలుస్తూ.. వారి అభివృద్ధికి తాము బాసటగా ఉంటామని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలతో సంబంధం లేకుండా వీపీఆర్ తో పలు హామీలు ఇప్పిస్తున్నారు. మరి నెల్లూరు మైనార్టీలు ఏ వైపు ఉంటారో చూడాలి.