Andhra Pradesh: యర్రగొండపాలెం గురుకుల విద్యాలయంలో దారుణం- విద్యార్థులతో వంట చేపిస్తున్న సిబ్బంది
Prakasam District:యర్రగొండపాలెం ST హాస్టల్‌లో విద్యార్థులతో సిబ్బంది వంటపనిచేయిస్తున్నారు. వంతుల వారీగా వారం రోజులపాటు పనులు అప్పగిస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yerragondapalem News: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్దుతాం, సంక్షేమశాఖ హాస్టళ్ల(Hostel)లో అన్ని వసతులు కల్పిస్తామంటూ నేతలు గొప్పలు చెప్పడమేగానీ...అసలు సాధారణ చదువులు కూడా సాగడం లేదు అక్కడ. పైగా హాస్టల్ విద్యార్థులతో ఇంటిపని, వంటపని చేయిస్తున్నారు.
మీ వంట మీరు చేసుకోవాల్సిందే
తల్లిదండ్రులను వదిలిపెట్టి ఊరికి దూరంగా చదువుకోసం వచ్చిన పేద విద్యార్థులతో హాస్టల్(Hostel) సిబ్బంది వంట చేయిస్తున్నారు. బడికి వెళ్లిరాగానే హోంవర్కు చేసుకోవడం లేదా చదువుకోవడం చేయాల్సిన విద్యార్థులు...వంటగదిలో చేరి కూరగాయాలు కోయడం, కోడిగుడ్ల పెంకు తీయడం, చపాతీలు చేయడం సహా ఇతరత్రా పనులు చేస్తున్నారు. వంతులు వారీగా రోజుకొకరు చొప్పున ఈ పనులు చేస్తేనే వారికి టిఫిన్, భోజనం పెట్టేది. ఒకటీ అరా పనుల్లో సాయం చేయడం తప్పులేదు కానీ ఏకంగా 250 మంది విద్యార్థులకు ఇవన్నీ చేసిపెట్టాల్సిందే. సుమారు 800 చపాలతీలకు పిండి కలపడం దగ్గర నుంచీ చపాతీలు చేయడం, వాటిని కాల్చి విద్యార్థులకు అందించాలంటే ఎంత కష్టమో కదా..ఆ చిన్నారి చేతులకు ఎంత పెద్దపెద్ద పనులు అప్పగిస్తున్నారో మీరే చూడండి..
గురుకుల విద్యాలయం పనే
ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెం(Yerragondapalem)లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులతో సిబ్బంది వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఆదివారం రోజు టిఫిన్ కోసం ఏకంగా 700 చపాతీలు చేయించారు. పిండి కలపడం దగ్గర నుంచి చపాతీలు కాల్చి విద్యార్థులకు ఇచ్చే వరకు అంతా వారే చేయాలి. అలాగే గుడ్లు (Eggs)పెంకు తీయడం వంటి పనులు అప్పగించారు.
కొన్నిరోజులుగా ఈ పనులు చేయిస్తున్నా విద్యార్థులు ఇంట్లో చెప్పలేదు. కానీ ఇటీవల వంతులవారీగా పనులు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. పనులు చేయని విద్యార్థులకు శిక్షలు విధిస్తుండటంతో వారు తల్లిదండ్రులకు తెలియజేశారు. చిన్న పిల్లలను వదిలేసి ఆరో తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల వరకు అందరికీ వంట డ్యూటీలు వేసినట్లు తెలిసింది.
ఉదయం టిఫిన్ చేసి పెట్టడం సాయంత్రం వచ్చిన తర్వాత కూరగాయలు కొయ్యడం వరకు అన్ని పనులు విద్యార్థులు చేయాల్సిందే. ఈ గురుకులంలో వంటమనుషులు, స్వీపర్లు కలిపి మొత్తం ఐదుగురు పనిచేయాల్సి ఉండగా...కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. వీరు కూడా పర్మినెంట్ ఉద్యోగులు కాకపోవడంతో ఒకరోజు వస్తే మరోరోజు రావడం లేదు. వీరితో పనిచేయిచండం వార్డెన్ కు తలకు మించిన భారంగా మారింది. దీంతో విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. చదువుకోవడానికి తమ పిల్లలను పంపిస్తే ఇలా వంటపనిచేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది చిన్నారులు ఈ పనులు చేయలేక ఏడుస్తున్నారని తెలిసింది. అయినప్పటికీ వంతుల వారీగా చేయాల్సిందేనని బలవంతం చేస్తున్నారని సమాచారం. ఇటు వంటపనిచేయలేక, అటు చదువులోకేలక ఇబ్బందిపడుతున్నామని వాపోతున్నారు.
ప్రిన్సిపల్ వివరణ
విద్యార్థులతో వంటపని చేయించడంపై ప్రిన్సిపల్‌ను సురేశ్‌బాబును వివరణ కోరగా...వంటపనిచేయడానికి పర్మినెంట్ సిబ్బంది లేరని....వచ్చిన వాళ్లు మధ్యలోనే మానేసిపోతున్నారని అందుకే విద్యార్థుల సాయం తీసుకోక తప్పడం లేదన్నారు. విద్యార్థుల సాయం లేకపోతే ఆ రోజు వారికి వంట నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.ప్రతిరోజూ పనులు చేయించడం లేదని...ఉన్న నలుగురి సిబ్బందిలో ఇద్దరు సెలవుపై వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల సాయం తీసుకున్నామన్నారు.