బాబాయ్ అబ్బాయ్ మధ్య మాస్ వార్నింగ్స్, నెల్లూరు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన విభేదాలు
ఇన్నాళ్లూ పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఇంకా ముదిరిపోయింది. ఇద్దరూ నేరుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. సీఎం జగన్ పంచాయితీ పెట్టినా కుదరదంటున్నారు.
నెల్లూరు వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయం రోడ్డునపడింది. నెల్లూరు సిటీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న బాబాయ్-అబ్బాయ్ పోరాటం ఇప్పుడు రచ్చకెక్కింది. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై దాడి జరగడం, బాధితుడిని పరామర్శించిన అనంతరం ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే అనిల్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. తన జోలికొస్తే పైనుంచి కింద దాకా చర్మం వలిచేస్తానంటూ హెచ్చరించారు. బాబాయ్, అబ్బాయ్ మధ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా మాటల తూటాలు పేలడంతో ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి.
అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ఎదుగుదలకు ఆయనకు బాబాయ్ వరసయ్యే రూప్ కుమార్ యాదవ్ అండదండలున్నాయి. అనిల్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన షాడో ఎమ్మెల్యేగా పనులు చక్కబెట్టేవారు. 2014లో అనిల్ వెనక రూప్ ఉన్నారు, 2019 ఎన్నికల్లో కూడా అనిల్ గెలుపుకి రూప్ కృషి చేశారు. కానీ ఇటీవల తేడాలొచ్చాయి. ఎవరి వర్గం వారుగా విడిపోయారు. ఎప్పుడూ ఒకరినొకరు నేరుగా విమర్శించుకునేవారు కాదు. నెల్లూరు సిటీలో రూప్ కుమార్ కొత్తగా పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు. నెల్లూరు సిటీలో పార్టీ రెండుగా చీలిపోయింది. కార్పొరేటర్లు చెరో వర్గం అయిపోయారు.
పార్టీకి ఈ వ్యవహారం నష్టం కలిగేంచేలా ఉండటంతో సీఎం జగన్ కావలి పర్యటనకు వచ్చినప్పుడు చొరవ తీసుకున్నారు. అనిల్, రూప్ చేయి చేయి కలిపేలా చేశారు. ఇకపై ఇద్దరూ కలసి ఉండాలన్నారు. కానీ ఇద్దరూ ససేమిరా అంటున్నారు. అనిల్ ముందుగా ప్రెస్ మీట్ పెట్టి తాను ఫలానా వ్యక్తితో కలవలేనన్నారు. జగన్ చెప్పినా ఆ పని చేయలేనన్నారు. అటు రూప్ కూడా అదేమాటపై ఉన్నారు. తాజాగా రూప్ వర్గం వ్యక్తిపై దాడి జరగడంతో ఈ విషయం రచ్చకెక్కింది.
ఇప్పటి వరకూ నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అన్నీ చూస్తూ ఉన్నానని, ఇకపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు రూప్ కుమార్ యాదవ్. తన మనుషుల జోలికొస్తే బాగుండదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అనిల్ అనే పేరెత్తకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన గెలుపుకోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తే, ఇప్పుడు తన మనుషులపైనే దాడులు చేస్తున్నారని, ఇలాంటి దాడుల్ని సహించబోమన్నారు. తాము కూడా అధికార పార్టీ మనుషులమేననే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు.
అనిల్ రియాక్షన్..
రూప్ కుమార్ మీడియాతో మాట్లాడిన కాసేపటికే అనిల్ ప్రెస్ ముందు ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లూ తానెప్పూడూ ఆ వ్యక్తి గురించి మాట్లాడలేదని, ఇకపై నోరు జారితే పైనుంచి కింద వరకు వలిచేస్తానన్నారు అనిల్. ఎవరో ఎవరిపైనో దాడి చేస్తే.. దానికి తానెలా బాధ్యుడిని అని ప్రశ్నించారు. కావాలనే బాధితుల్ని కూర్చోబెట్టి తనపేరు చెప్పిస్తున్నారని మండిపడ్డారు.
ఇన్నాళ్లూ పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఇంకా ముదిరిపోయింది. ఇద్దరూ నేరుగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. సీఎం జగన్ పంచాయితీ పెట్టినా కుదరదంటున్నారు. అయితే ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సీనియర్ల మాట. జిల్లా పార్టీ నేతలు కూడా వీరి గొడవలో తలదూర్చే సాహసం చేయడంలేదు. చివరకు ఈ పంచాయితీ జగన్ దగ్గరకే చేరేలా ఉంది.