Police Constable Died : క్రికెడ్ ఆడుతూ కానిస్టేబుల్ హఠాన్మరణం- అసలేం జరిగిందంటే?
అప్పటికే ఒక మ్యాచ్ పూర్తయింది. మరో మ్యాచ్ కోసం అందరూ సిద్ధమయ్యారు. నాగేశ్వరరావు బౌలింగ్ చేస్తూ బాల్ వేసిన తర్వాత ఒక్కసారిగా ముందుకు పడిపోయారు.
పేరు కె.నాగేశ్వరరావు, వయసు 36 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆరోగ్య సమసస్యలేవీ లేవు. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు నాగేశ్వరరావు. అతనికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. విధి నిర్వహణలో హుషారుగా ఉండే నాగేశ్వరరావుకి క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో కూడా క్రికెట్ బాగా ఆడేవారు. తరచూ స్నేహితులతో కలసి సెలవు రోజుల్లో క్రికెట్ ఆడటానికి వెళ్లేవారు. రాపూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పని చేస్తున్న నాగేశ్వరరావు మిట్టవడ్డిపల్లిలో నివశించేవారు. డక్కిలిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లి మరణించారు.
అసలేం జరిగింది...?
అప్పటికే ఒక మ్యాచ్ పూర్తయింది. మరో మ్యాచ్ కోసం అందరూ సిద్ధమయ్యారు. నాగేశ్వరరావు బౌలింగ్ చేస్తూ బాల్ వేసిన తర్వాత ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. స్నేహితులంతా మొదట ఫిట్స్ గా భావించి అతని చేతిలో తాళాలు పెట్టి కాసేపు సపర్యలు చేశారు. చలనం లేకపోవడంతో భయపడ్డారు. వెంటనే డక్కిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మండలంలోని మిట్టవడ్డిపల్లిలో ఉన్న కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి చేరుకుని భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుల్‌కు భార్య, ఐదేళ్లు, రెండేళ్ల వయస్సున్న కుమార్తెలున్నారు.
కార్డియాక్ అరెస్ట్..
గుండెపోడు వస్తే వెంటనే చికిత్స అందిస్తే బతికే అవకాశముంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అయితే ఒక్కసారిగా కరెంటు స్విచాఫ్ చేసినట్టుగా పల్స్ ఆగిపోతుంది, ప్రాణం పోతుంది. నాగేశ్వరరావు విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్ తో వెంటనే ప్రాణం పోయింది. మిత్రులు సపర్యలు చేసినా, ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
ఆరోగ్యవంతులైనా సరే..
బయటకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నా కూడా కార్డియాక్ అరెస్ట్ అయితే అక్కడితో ప్రాణం పోయినట్టే లెక్క. నాగేశ్వరరావు విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు వైద్యులు. పైకి ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇలాంటి అపాయాలు ఎదురవుతాయని చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కి ఇదీ కారణం అని చెప్పలేమని ఇటీవల కాలంలో 30నుంచి 50ఏళ్ల లోపు వయసు వారు ఎక్కువగా ఇలాంటి కారణాలతో మరణించడం చూస్తున్నాం.
పోలీసు లాంఛనాలతో తుది వీడ్కోలు..
రాపూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కె. నాగేశ్వరరావు, పీసీ-2894, ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానిక పోలీసు సిబ్బంది, అధికారులు అశ్రునయనాలతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డక్కిలి మండలం లోని డి. మిట్టవడ్డిపల్లి గ్రామంలో పోలీసు లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు.