Vehicle Registration Scam: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..
నెల్లూరు జిల్లా కేంద్రంగా జరిగిన వాహనాల రిజిస్ట్రేషన్ దందా గుట్టు రట్టయింది. గతంలో ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కేంద్రంగా జరిగిన వాహనాల రిజిస్ట్రేషన్ దందా గుట్టు రట్టయింది. గతంలో ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేశారు. సూళ్లూరుపేట మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గోపీనాయక్ ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో గూడూరు ఆర్టీవో మల్లికార్జున రెడ్డిని రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరిపైనే వేటు పడింది. అయితే ఈ వ్యవహారంలో చాలా మందికి భాగస్వామ్యం ఉందని, వారి పేర్లు కూడా బయటకు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం అధికారులే కాదు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ తతంగాన్ని నడిపించిన వారిలో ఉన్నారు. వారిపై కేసులు పెట్టేందుకు కూడా ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన బీఎస్-4 వాహనాలకు గత రెండు మూడు నెలలుగా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఏపీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అది కూడా సూళ్లూరుపేట కేంద్రంగా జరగడం పలు అనుమానాలకు తావిచ్చింది. 82 ట్యాంకర్లు, 118 భారీ వాహనాలకు ఇలా సూళ్లూరుపేటలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు ఇక్కడ పెట్టుకున్నా కూడా దీనికి సంబంధించిన డేటా ఎంట్రీ అంతా విజయవాడ, గుంటూరు కేంద్రంగా జరుగుతోంది. అసలు అరుణాచల్ ప్రదేశ్ వాహనాలను ఏపీకి ఎందుకు తెస్తున్నారు, అది కూడా ఒకదాని వెంట ఒకటి అన్నీ సూళ్లూరు పేటకు ఎందుకు క్యూ కడుతున్నాయనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ప్రాథమికంగా తప్పు జరిగిందని నిర్థారించి ఇద్దరు అధికారులపై వేటు వేశారు.
నెల్లూరులోనే ఎందుకు..?
ఒక రాష్ట్రంలోని వాహనాలను వేరొక రాష్ట్రంలోని వ్యక్తులు వ్యాపార అవసరాల నిమిత్తం కొనుగోలు చేస్తుంటారు. ఇలా అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ట్యాంకర్లు, ఇతర భారీ వాహనాలను మధ్యవర్తులు ఏపీ కేంద్రంగా అమ్మడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ బీఎస్-4 వాహనాలు. వాటిని అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఏపీ పేరిట రిజిస్ట్రేషన్ మార్చేసి.. ఇక్కడ అవసరమైనవారికి ఎక్కువ మార్జిన్ కి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ వాహనాలను ఏపీ నెంబర్ పై మార్చేందుకు ఓ ముఠా ప్రయత్నించింది. వాస్తవానికి ఇలా చేయాలంటే ముందుగా ఆ రాష్ట్రం నుంచి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. మిగతా రాష్ట్రాలన్నీ దాటుకుని వాహనాలను నేరుగా ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో అక్కడికి తేవాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత వాటికి రిజిస్ట్రేషన్లు చేస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఈ స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ.
వాహనాలు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేశారా..?
వాహనం ఏ రాష్ట్రం నుంచి వస్తుందో.. అక్కడి రవాణాశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కూడా ఉండాలి. వీటిని పరిశీలించిన తర్వాత బ్రేక్ ఇన్ స్పెక్టర్ వాహనాన్ని తనిఖీ చేసి ట్యాక్స్ ఎంత కట్టాలనేది నిర్థారిస్తారు. దీని తర్వాత డేటా ఎంట్రీ చేస్తారు. కానీ ఇవేవీ ఇక్కడ జరిగినట్టు లేవు. కనీసం వాహనాలు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆధారాలు లేవు. దీంతో ఇదంతా పెద్ద గూడుపుఠానీ అని అర్థమవుతోంది. ఒక్కోరోజు ఏకంగా 10 వాహనాలు రిజిస్ట్రేషన్ కావడంతో అనుమానం మొదలై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నెల్లూరు డీటీసీ చందర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది.
Also Read: Nellore Artist: అగ్గిపెట్టె నుంచి అంతరిక్షం వరకు అన్నీ సీసాలోకి ఎక్కిం చేస్తాడు
Also Read: సినిమా స్టైల్ లో వ్యాపాారి కిడ్నాప్.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?