Nellore: ట్రెజరీ ఉద్యోగుల నిరసన, ఒకరికి అస్వస్థత.. ఒత్తిడి చేయొద్దని కలెక్టర్‌కు వినతి పత్రం
ట్రెజరీ అధికారులు, పేఅండ్ అకౌంట్స్ అధికారులపై కొత్త పీఆర్సీ బిల్లులు చేయాలనే ఒత్తిడి తగ్గించాలని కోరుతూ కలెక్టర్ చక్రధర్ బాబుకు జిల్లా పీఆర్సీ సాధన సమితి నాయకులు వినతిపత్రం అందచేశారు.
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయలేమంటూ ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు. తాము కూడా మెరుగైన పీఆర్సీ సాధన కోసం పోరాడుతున్నామని ఈ క్రమంలో ఉద్యంలో భాగమైన తాము, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేస్తే దాన్ని అంగీకరించినట్టు అవుతుందని పేర్కొన్నారు. ట్రెజరీ ఉద్యోగులకు జిల్లా పీఆర్సీ సాధన సమితి నాయకులు కూడా మద్దతు తెలిపారు.
ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు న్యాయం చేయాలని పీఆర్సీ సాధన సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతాలు పెరగవని తెలిపారు. జీతాలు పెరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పు అని వివరించారు.
ఫిబ్రవరి 3న చలో విజయవాడ..
ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి వేలాదిగా ఉద్యోగులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. మరోవైపు నిరసనలో ఉన్న ట్రెజరీ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరి జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని డీడీలు మెసేజ్ లు పెట్టారు. ఆ ఒత్తిడి తాము భరించలేమంటూ ఉద్యోగులు కార్యాలయాల బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతానికి ఇప్పటి నుంచే ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. విజయవాడ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏటీవోకి అస్వస్థత..
ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోందని విమర్శిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవో) రాజశేఖర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ బీపీ ఎక్కువై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయనను తోటి ఉద్యోగులు హుటాహుటిన నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయాలని అధికారులు తీవ్ర ఒత్తిడి చేయటం వల్ల రాత్రింబవళ్లు పనిచేయటంతో ఏటీవో కుప్పకూలిపోయారని ఏపీటీఎస్‌ఎస్‌ఏ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారులు దిగువ స్థాయి అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెంచవద్దని కోరారు. లేకపోతే సహాయనిరాకరణ తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏటీవో ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
కలెక్టర్ కి వినతి..
ట్రెజరీ అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులపై కొత్త పీఆర్సీ బిల్లులు చేయాలనే ఒత్తిడి తగ్గించాలని కోరుతూ కలెక్టర్ చక్రధర్ బాబుకు జిల్లా పీఆర్సీ సాధన సమితి నాయకులు వినతి పత్రం అందచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని డీడీవోలకు అనుమతి పత్రాలు అందచేశామని కలెక్టర్ కు తెలిపారు.