Kotamreddy Ready : ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు కోటంరెడ్డి - గురువారం ఏం చేయబోతున్నారో తెలుసా ?
జలదీక్షకు కోటంరెడ్డి సిద్ధమయ్యారు. దీక్ష చేస్తారా ? పోలీసులు అరెస్ట్ చేస్తారా ?
Kotamreddy Ready : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటున్నారు. అధికారికంగా టీడీపీలో చేరకపోయినా, వైసీపీకి చుక్కలు చూపిస్తానంటున్నారు. తాజాగా ఆయన జలదీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వతేదీన నెల్లూరు పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్షకు దిగుతానంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదన్నారు. ఇప్పుడు పార్టీనుంచి బయటకొచ్చాక రూరల్ సమస్యలకోసం అలుపెరగకుండా పోరాడతానంటున్నారు. 8 గంటలు జలదీక్ష చేపట్టి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గాంధీగిరి తరహాలో ఉద్యమం చేస్తానంటున్నారు.
ప్రభుత్వంపై కోటంరెడ్డి ప్రత్యక్ష పోరు
ఫోన్ ట్యాపింగ్ అభియోగాలతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీనుంచి దూరం జరిగారు. పార్టీ పెద్దలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ కి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించడంతో ఆ ఎడబాటు మరింత పెరిగింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. కోటంరెడ్డి వైసీపీకి దూరం జరిగినా ఇంకా టీడీపీలో అధికారికంగా చేరలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి మాత్రమే పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన రూరల్ లో టీడీపీ నేతలను కలుపుకొని వెళ్తున్నారు. ఎన్నికలు వచ్చేలోగా రూరల్ ఎమ్మెల్యే హోదాలో సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానంటూ కోటంరెడ్డి గతంలోనే కార్యాచరణ ప్రకటించారు. దాన్ని ఇప్పుడు అమలులో పెడుతున్నారు.
దీక్షను పోలీసులు అడ్డుకుంటారా ?
కోటంరెడ్డి జలదీక్ష చేపట్టే ప్రాంతం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. అక్కడ ఆయన జలదీక్ష చేపడితే కచ్చితంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే అభిప్రాయం ఉంది. పోలీసులను ముందుగానే అనుమతి అడిగాను అని కోటంరెడ్డి చెబుతున్నా, రేపు ఆయన దీక్షకు పోలీసులు బ్రేక్ వేసే అవకాశముంది. దీంతో నెల్లూరు రూరల్ లో గందరగోళం నెలకొంటుందనే అనుమానాలున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలిసి కూడా కోటంరెడ్డి పోరాటానికే సిద్ధమంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటుందా, లేక బలప్రయోగం చేసి కోటంరెడ్డిపై సింపతీ పెరిగే అవకాశం ఇస్తుందా.. వేచి చూడాలి.
నెల్లూరు వైసీపీకి వరుస తలనొప్పులు !
నెల్లూరు రూరల్ లోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలు వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొంతమంది వాటిని లైట్ తీసుకున్నారు. కానీ కొన్ని చోట్ల స్థానికులనుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు రూరల్ లో కూడా రోడ్ల సమస్య, పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జ్ సమస్య అలాగే ఉంది. వాటిని పరిష్కరించే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యే హోదాలో కోటంరెడ్డి చాలా సార్లు ఇబ్బంది పడ్డారు. తన సొంత నిధులతో బ్రిడ్జ్ కి ప్రత్యామ్నాయంగా బైక్ లు, సైకిళ్లు వెళ్లడానికి ఏర్పాటు చేశారు కోటంరెడ్డి. చెరువు నీరు ఉధృతంగా ప్రవహిస్తే అది కూడా ఎక్కువరోజులు నిలబడదు. దీంతో ఆయన కచ్చితంగా అక్కడ బ్రిడ్జ్ కావాలంటున్నారు. దానికోసం ఇప్పుడు జల దీక్షకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.