Nellore News: నెల్లూరు ఎంపీ స్థానంలో గెలవడం వైసీపీ కంటే విజయసాయి రెడ్డికి ప్రతిష్టాత్మకం
Vijaya Sai Reddy: ఎన్నికల కోసం ఐప్యాక్ ని కాదని, సొంత టీమ్ ని విజయసాయిరెడ్డి రంగంలోకి దింపారు. ఉత్తరాదినుంచి వచ్చిన ఈ టీమ్ ఇప్పుడు నెల్లూరులో మకాం వేసింది.
Andhra Pradesh Elections 2024: నిన్న మొన్నటి వరకు వైసీపీ రాష్ట్ర వ్యవహారాలన్నీ చక్కబెట్టిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు కేవలం నెల్లూరు జిల్లాకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీలో చేరారు, తిరిగి అదే స్థానానికి పోటీగా నిలిచారు. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయసాయి ఇప్పుడు నెల్లూరులో ఎంపీగా గెలవగలరా..? ఆయన బలం ఏంటి..? బలహీనత ఏంటి..?
సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్ల కాలువ లెక్క కాదు.. కానీ విజయసాయిరెడ్డికి నెల్లూరు విజయం నల్లేరుపై నడక కాకపోవచ్చు. ఇది తన సొంత జిల్లా అని ఆయన చెప్పుకుంటున్నా.. జిల్లా వాసులు, జిల్లాలోని నాయకులకు ఆయనతో నేరుగా పరిచయాలు లేవు. జిల్లాలో పుట్టిపెరిగినా, జిల్లా రాజకీయాలతో నేరుగా సంబంధాలు లేకపోవడం ఆయన మైనస్. అందులోనూ ఆయన పరిచయాలన్నీ పై స్థాయిలోనే ఉంటాయి. నేరుగా కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఆయన వరకూ వెళ్లగలరా అంటే అనుమానమే. అదే సమయంలో అటు టీడీపీ అభ్యర్థి వీపీఆర్ మాత్రం క్షేత్ర స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటున్నారు, ఏళ్లతరబడి ఇక్కడ అందర్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి తన విజయంపై కంగారు పడుతున్నారు.
ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం..
గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెల్చుకున్న వైసీపీ జిల్లా పరిధిలోకి వచ్చే రెండు లోక్ సభ స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. 2024కి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. జిల్లానుంచి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయించారు. వారందరికీ టీడీపీ ఆశ్రయం ఇచ్చింది. ఆమేరకు టీడీపీ బలపడిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అయినా, ఇంకో పెద్ద నేత అయినా జిల్లాలో ఎంతమేర ప్రజలను ప్రభావితం చేయగలరు అనేదే అసలు ప్రశ్న. అయితే ఇన్నాళ్లూ విజయసాయిరెడ్డికి వైసీపీ వ్యూహకర్తగా పేరుంది, ఇప్పుడు ఆ వ్యూహకర్తే నేరుగా ఎన్నికల బరిలో దిగుతున్నారు, పైగా అది ఆయన సొంత జిల్లా. అంటే ఇప్పుడు వైసీపీ కంటే విజయసాయిరెడ్డికి వ్యక్తిగతంగా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఐ ప్యాక్ కాదు.. అంతకు మించి
విజయసాయిరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాకు వచ్చిన రోజున భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. ఇక ఎన్నికల కోసం ఐప్యాక్ ని కాదని, సొంత టీమ్ ని ఆయన రంగంలోకి దింపారు. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ టీమ్ ఇప్పుడు నెల్లూరులో మకాం వేసింది. ఆయన ప్రచారాలు, రోడ్ షోలు, మీటింగ్ లు.. అన్నిట్నీ ఈ టీమ్ కోఆర్డినేట్ చేస్తోంది. వీపీఆర్ ఇప్పటికే స్థానికంగా అందరికీ పరిచయస్తులు, ఆయన్ను ఓడించాలంటే, అంత కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే సరిపోదు, స్థానికంగా అందరికీ చేరువ కావాలి. అందుకే విజయసాయిరెడ్డి కూడా అదే వ్యూహంతో ఉన్నారు. వరుస కార్యక్రమాలతో జిల్లాలో బిజీ కావాలని చూస్తున్నారు. తాను పుట్టిపెరిగిన జిల్లా, తన సొంత జిల్లా అని చెబుతున్న ఆయన.. ఈ జిల్లాలో తన గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.