Nellore MP Adala: కొబ్బరికాయ, జేసీబీ - ఎంపీ ఆదాల రూటే సెపరేటు!
Nellore Politics: పనులు మొదలవుతున్నాయి కానీ ఎన్నికల నాటికి అవి పూర్తవుతాయో లేదో అనేది మాత్రం అనుమానమే. ఇలాంటి ప్రారంభోత్సవాలు ఎంపీ సొంత నిధులతో మొదలు పెట్టొచ్చు.
Nellore MP Adala Prabhakar Reddy: ఏపీలో చాలామంది వైసీపీ నేతలకు స్థాన చలనాలు తప్పవని తెలుస్తోంది. ఇటీవల కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను కూడా సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఈ ఎపిసోడ్ కంటే ముందే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ప్రకటించారు. అంటే దాదాపుగా సీటు మార్పు అనేది అక్కడినుంచే మొదలైంది అనుకోవాలి. అప్పటికే ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే స్థానానికి ఇన్ చార్జ్ గా ప్రకటించడం సంచలనంగా మారింది. అదే స్థానంలో కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వకుండా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎదుర్కొనేందుకే జగన్ ఈ వ్యూహం రచించారు.
2024 ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా, ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. అలాంటి నియోజకవర్గం నెల్లూరులో కూడా ఉంది. నెల్లూరు ఎంపీ ఆదాల వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ టికెట్ పై పోటీచేయబోతున్నారు. అయితే అక్కడ వరుసగా రెండుసార్లు వైసీపీ టికెట్ పై గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకు ప్రత్యర్థి. ఆయన ఈసారి టీడీపీ టికెట్ పై పోటీ చేయబోతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడు నెల్లూరులో ఆసక్తికరంగా మారింది.
రూరల్ లో గెలుపు ఎలా..?
వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాతుకుపోయారు. పార్టీ పరపతి, జగన్ పై ప్రజలకు ఉన్న అభిమానంతోపాటు.. కోటంరెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇక్కడ గెలుపుకి ప్రధాన కారణం. కోటంరెడ్డికి పార్టీలకు అతీతంగా ఇక్కడ అభిమానులున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లాక వారంతా ఆయనతోనే వెళ్లిపోయారు. అయితే వైసీపీలో ఉన్న కొందరు స్థానిక నాయకులు, కోటంరెడ్డి అనుచరులు మాత్రం ఆయనకు హ్యాండిచ్చారు. వారంతా ఆదాల వర్గంలో చేరారు. అంతమాత్రాన ఆదాలకు ఈసారి విజయం నల్లేరుపై నడక కాదు. కానీ ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో కోటంరెడ్డిని ఎదుర్కోగలరు అంటున్నారు. కేవలం అర్థబలం, అంగబలాన్నే నమ్ముకోకుండా ప్రజల్లో కూడా పాపులారిటీకోసం ప్రయత్నిస్తున్నారు ఆదాల.
రోజుకో ప్రారంభోత్సవం..
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి. వాటి పరిష్కారం విషయంలో ఆలస్యం జరుగుతోందని అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు పలు వేదికలపై ప్రస్తావించారు కోటంరెడ్డి. అలా ప్రభుత్వానికే వ్యతిరేకం అయ్యారు, చివరకు వివిధ కారణాలతో పార్టీనుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడా పనులు పూర్తి చేయడానికి ఆదాల ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో రోజుకొక శంకుస్థాపనతో ఆయన హడావిడి చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో వార్డుల్లోకి ఆయన వెళ్లేముందుగా జేసీబీ వెళ్తుంది, ఆ జేసీబీ ముందు ఆయన, ఇతర నాయకులు కొబ్బరికాయలు కొడతారు. అక్కడితో పని మొదలవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజూ రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నాయి.
పనులు మొదలవుతున్నాయి కానీ ఎన్నికల నాటికి అవి పూర్తవుతాయో లేదో అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే ఇలాంటి ప్రారంభోత్సవాలు ఎంపీ సొంత నిధులతో మొదలు పెట్టొచ్చు. కానీ పనులు పూర్తవ్వాలంటే మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు కావాలి. ఆ నిధులు ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉన్నాయనుకోలేం. అందుకే ప్రారంభోత్సవాలతో సరిపెడుతున్నారు. నాయకులు కూడా శంకుస్థాపనలు, పనుల ప్రారంభోత్సవాలతో హడావిడి చేస్తున్నారు. మరి ఈ హడావిడి ఆదాలకు ఏమాత్రం పనికొస్తుందో చూడాలి. అటు కోటంరెడ్డి మాత్రం చాపకింద నీరులా తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కడినే ఒంటరిగా అంటూ నియోజకవర్గం చుట్టేస్తున్నారు. వచ్చేసారి ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది.