Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం
Vijayawada Floods: విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో, వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు ముందున్నారు.
Andhra Pradesh: విజయవాడని వరదలు చుట్టుముట్టాయి. బెజవాడ విలయానికి ఏపీలోని ఇతర ప్రాంతాలు కూడా కంటతడి పెట్టాయి. తమకు తోచినంత సాయం చేయడానికి అన్ని ప్రాంతాల వారు ముందుకొచ్చారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, నేరుగా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలబడేందుకు కూడా అన్ని ప్రాంతాలనుంచి స్వచ్ఛందంగా కొంతమంది కదలి వచ్చారు. నెల్లూరు జిల్లానుంచి కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు ముందున్నారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరద సాయం కోటి రూపాయలు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబుని కలసి ఆయన చెక్కుని అందించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఆర్థిక సాయం చేశారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ అయినా ఆయన నెల్లూరీయుడే. మాగుంట ఫ్యామిలీ తరపున కోటీ యాభై లక్షల రూపాయల భారీ సాయాన్ని ఆయన అందజేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దివంగత నేత, మాగుంట సుబ్బరామిరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్‌రెడ్డి.. సీఎం చంద్రబాబుని కలసి చెక్కు అందించారు. అంతకు ముందే ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియాకు రూ.10లక్షల చెక్కుని కూడా అందించారు.
పెద్ద మనసు చాటుకున్న వేమిరెడ్డి దంపతులు
— Vemireddy Prabhakar Reddy (@VPR_Official_) September 3, 2024
-----------------
వరద బాధితులకు అండగా సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించిన వేమిరెడ్డి దంపతులు... #Vemireddyprabhakarreddy #Vemireddyprashanthireddy #NelloreMP #KovurMLA #Team_VPR #APGovtWithFloodVictims#CBNsFatherlyCare… pic.twitter.com/u4BiI9Ou6r
ఇక వరద సహాయక చర్యల్లో నెల్లూరు జిల్లా మంత్రులు బిజీగా మారారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఎం చంద్రబాబు వెంటే ఉన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన కూడా ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంటికి కూడా వెళ్లకుండా మంత్రి నారాయణ విజయవాడలోనే మకాం వేశారు. సమీక్షలతో మున్సిపల్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వరద సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరదలు మొదలైన తర్వాత ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. తన శాఖకు సంబంధం లేకపోయినా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేరుగా క్షేత్ర స్థాయిలో దిగి బాధితులకు బాసటగా నిలిచారు. నెల్లూరు నుంచి తన టీమ్ ని కూడా రప్పించి విజయవాడలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఆనం. నిత్యావసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
నెల్లూరు జనసేన తరపున కూడా ఓ టీమ్ విజయవాడకు వెళ్లింది. జానీ మాస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు జనసేన పార్టీ నేతలు గునుకుల కిషోర్ సహా వీర మహిళలు విజయవాడ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జానీ మాస్టర్ సినిమా షూటింగ్ లను సైతం పక్కనపెట్టి విజయవాడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జనసైనికులు స్థానికులకు ఆర్థిక సాయం చేయడంతోపాటు, వస్తువులను కూడా అందించారు.
వరద తీవ్రతను కూడా లెక్క చేయకుండా ప్రతిచోట సేవ చేస్తున్న ప్రతి జన సైనికుడు @PawanKalyan గారే
— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚 (@GunukulaKishore) September 5, 2024
వరద ప్రభావిత ప్రాంతాలైన విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్, గన్నవరం రామర్పాడు ప్రాంతాలను సందర్శించి ఆహర పొట్లాలను,నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన @JanaSenaParty నాయకులు @AlwaysJani గారు ...… pic.twitter.com/0bBHBn5DG7
నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరపున నెల్లూరు టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులు రూ.10లక్షలు విరాళంగా అందించారు.
నెల్లూరు ఉద్యోగుల సేవలు కూడా తక్కువ చేయలేం. ప్రత్యేకించి నెల్లూరు జిల్లానుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు.. విజయవాడ వెళ్లి అక్కడే మకాం వేశారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనగలిగే అధికారుల్ని విజయవాడ పిలిపించుకుని అక్కడ డ్యూటీలు వేశారు. బాధితుల్ని రక్షించడం, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, పునరావాస కేంద్రాలకు సామగ్రిని చేరవేడయం ఇలా అన్ని కార్యక్రమాలను రెవెన్యూ ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కూడా నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లి వారి సేవలు అందించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ తరపున లారీల్లో నిత్యావసరాలు విజయవాడకు తరలించారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ హోటళ్లు ఆహార పదార్థాలను కూడా ఇక్కడినుంచి పంపించాయి. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కూడా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. వరద ప్రభావం కేవలం విజయవాడకే పరిమితమైనా.. ఇతర ప్రాంతాల నాయకులు, ప్రజలు సహాయక చర్యల్లో తమవంతు బాధ్యత నిర్వర్తించారు.
Also Read: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే!