Jain Paryushan 2022: నెల్లూరులో వైభవంగా జైనుల పర్వ్ పర్యుషాన్ పండుగ - ఇది సంతోషాల సమయం కాదు
Jain Paryushan 2022: జైనుల పండగల్లో ప్రధాన మైనది పర్వ్ పర్యుషాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులంతా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. నెల్లూరులో కూడా పర్వ్ పరుష్యాన్ ఘనంగా మొదలైంది.
భారతదేశం ఎన్నో మతాలు, కులాలు, భిన్న సంస్కృతులకు నిలయం. మన దేశంలో జైనుల జనాభా చాలా తక్కువ. దేశవ్యాప్తంగా జైనుల జనాభా 42లక్షలు ఉంటుందని అంచనా. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే.. ఒక్క నెల్లూరు నగరంలోనే జైనులు 5వేలమందికి పైగా నివసిస్తున్నారు. నెల్లూరులోని మండపాల వీధి, జైన్ వీధి.. ఇలా కొన్ని ప్రాంతాల్లో కేవలం జైన కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. నెల్లూరు నగరంలో మొత్తం ఐదు జైన దేవాలయాలుండగా.. అందులో ప్రధాన దేవాలయంలో పర్వ్ పరుష్యాన్ పండగ ఘనంగా మొదలైంది.
జైనులకు ముఖ్యమైన పర్వ్ పరుష్యాన్ పండగ
జైనుల పండగల్లో ప్రధాన మైనది పర్వ్ పర్యుషాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులంతా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. నెల్లూరులో కూడా పర్వ్ పరుష్యాన్ ఘనంగా మొదలైంది. 8 రోజులపాటు జరిగే ఈ పండుగలో ముఖ్యంగా ఉపవాస దీక్షలకు ప్రాధాన్యముంటుంది. చివరి రోజున ఏడాదిపాటు చేసిన తప్పులు, మనస్ఫూర్తిగా క్షమాపణ కోరే మహాపర్వం ఉంటుంది.
పర్వ్ పర్యుషాన్ అంటే మనల్ని మనం తెలుసుకోవడం. పరి అంటే మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవడం, వాసన్ అంటే ఒక ప్రదేశంలో అనే అర్థం వస్తుంది. మనల్ని మనం తెలుసుకోవడం, గుర్తించుకునే పండగే పర్వ్ పర్యుషాన్. పరయూషన్ అంటే కర్మ రూపంలో మనం సేకరించిన మలినాన్నంతా మనం శుభ్రం చేసుకునే సమయం అన్నమాట.
సంతోషాల పండుగ కాదు..
పర్యుషాన్ అనేది సంతోషాల పండుగ కాదు అంటారు జైనులు. ఇది తమను తాము అదుపులో ఉంచుకోడానికి క్రమశిక్షణ మార్గంలో ఉంచుకోడానికి చేసుకునే పండుగ అని చెబుతుంటారు. ప్రజలు సాధారణ జీవితం గడిపేందుకు అలవాటు పడాలని, అందుకే ఈ పండుగ జరుపుకుంటామని అంటారు. ఆహారం నుంచి ధరించే దుస్తుల వరకు, ఆలోచనల నుంచి పనుల వరకు ప్రతిదాన్నీ శుద్ధి చేయడానికి ఈ సందర్బంగా ప్రయత్నిస్తారు.
ఉపవాసం, ఆలయాల సందర్శన
పర్వ్ పర్యుషాన్ పండగ సందర్భంగా.. జైనులంతా ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక భావనతో ఆలయాలను సందర్శిస్తారు. అహింస, క్రమశిక్షణ, ఉపవాస తపస్సు, ఆథ్యాత్మిక గ్రంథాల అథ్యయనం, ఆత్మ పరిశీలన, పశ్చాత్తాపం అనేవి పాటించాలి. పండుగ పర్వదినాల్లో జైనమత సూత్రాలపై ఆధారపడిన మతపరమైన పుస్తకాలు, గ్రంథాలను జైనులంతా అధ్యయనం చేస్తారు.
కఠిన ఉపవాస దీక్ష..
కఠిన ఉపవాసం ఉండేవారు కేవలం మంచినీరుని మాత్రమే అది కూడా ఒకపూట మాత్రమే సేవిస్తారు. ఆ తర్వాత పూర్తిగా ఉపవాసముంటారు. కొన్నిరోజులపాటు కేవలం ఉప్పుకారం లేని, కూరగాయలను మాత్రమే భుజిస్తారు. ఉపవాస సమయంలో జైనులు భూగర్భ దుంపలు, కందమూలాలు తినరు. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయరు. ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపవాసం స్వీకరిస్తారు.
నెల్లూరు జైన్ టెంపుల్ ప్రత్యేకత...
నెల్లూరులో జైన తీర్థ క్షేత్రాలు 3 ఉన్నాయి. నగరంలో 5 జైన మందిరాలున్నాయి. నెల్లూరులో ఉన్న జైన దేవాలయంలో 11 వ తీర్థంకరుడైన శ్రేయాన్ష నాథ్ విగ్రహం ఉంటుంది. నెల్లూరులో ఉన్న జైనులుంతా 8రోజులపాటు పర్వ్ పర్యుషాన్ పర్వదినాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.